సాంకేతిక విద్యతోనే మెరుగైన భవిష్యత్
– మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
– అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ సంకీర్త్
భూపాలపల్లి, ఆగస్టు 6 (పీపుల్స్ డైరీ):
నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధితోనే యువత మెరుగైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోగలరని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను గురువారం సందర్శించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక వసతులు, శిక్షణా ప్రయోగశాలలను పరిశీలించారు. అనంతరం శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి విద్య, శిక్షణ, భవిష్యత్ లక్ష్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ఆధునిక టెక్నాలజీపై పట్టు సాధించి, కొత్త నైపుణ్యాలను పెంపొందించుకుంటే దేశ, విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిరంతరం నేర్చుకోవడం, క్రమశిక్షణతో లక్ష్యసాధన కోసం శ్రమించడం ద్వారా ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. యువత చెడు అలవాట్లు, మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఎస్పీ స్పష్టం చేశారు. సిగరెట్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా విద్య, నైపుణ్యాభివృద్ధిపైనే దృష్టి సారించాలని సూచించారు. సత్సంగతులు, కృషి, క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగితే ప్రతి విద్యార్థి జీవితంలో విజయం సాధించగలడని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడ్వాన్సుడు టెక్నాలజీ సెంటర్ ప్రిన్సిపాల్ జుమ్లానాయక్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, భూపాలపల్లి సిఐ నరేష్, అడ్వాన్సడ్ టెక్నాలజీ సెంటర్ సిబ్బంది, విద్యార్థులు, జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.
