PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 12:34 pm Posted by : PEOPLES DAIRY NEWS

‘ఢీ అంటే ఢీ’.. భీమారంలో హైటెన్షన్!

 

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్ భీమారంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెయ్యి రోజుల ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ భీమారం బస్టాండ్ వద్ద సంబరాలు నిర్వహించగా.. అదే ప్రాంతంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. కేవలం ఐదు మీటర్ల దూరంలోనే ఇరువర్గాలు డీజేలు ఏర్పాటు చేసుకుని పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ‘డీ అంటే డీ’ అంటూ ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం ముందుకు దూసుకెళ్లి ఒకరినొకరు తోసుకున్నారు. సమాచారం అందుకున్న ఏసీపీ నరసింహారావు ఆధ్వర్యంలో స్థానిక ఇన్‌స్పెక్టర్ రవికుమార్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇరువర్గాలను కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఇరువర్గాల కార్యకర్తలు నేషనల్ హైవేపై బైఠాయించడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది