- తెలంగాణకు విదేశీ కిక్కు..?
- మందుబాబులకు ఎగిరి గంతేసే న్యూస్..
- 121 కొత్త లిక్కర్ బ్రాండ్లకు గ్రీన్ సిగ్నల్?
పీపుల్స్డైరీ–హైదరాబాద్ : తెలంగాణ మందుబాబులకు ఇది నిజంగానే కిక్కిచ్చే వార్త. ఇప్పటి వరకు దేశీయ, లోకల్ బ్రాండ్లతోనే సరిపెట్టుకున్న మద్యం ప్రియులకు త్వరలో అంతర్జాతీయ రుచులు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత సింగిల్ మాల్ట్ విస్కీలు, లగ్జరీ లిక్కర్లు, విదేశీ బీర్లు, వైన్లు రాష్ట్ర మద్యం మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) ఏకంగా 18 ప్రముఖ మద్యం సరఫరా సంస్థలకు చెందిన 121 కొత్త లిక్కర్ బ్రాండ్లను రాష్ట్రంలోకి తీసుకొచ్చేందుకు ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో గ్లెన్‌ఫిడిక్, ది మెకాలన్ సింగిల్ మాల్ట్ విస్కీలు, లూయిస్ థర్టిన్ కాగ్నాక్‌తో పాటు హెండ్రిక్స్ జిన్, మంకీ షోల్డర్, టైగర్ లాగర్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లు ఆకర్షణగా నిలుస్తున్నాయి. 12, 15, 18, 21 ఏళ్ల నాటి సింగిల్ మాల్ట్ విస్కీలతో పాటు కొరియన్, జర్మన్ బ్రాండ్లకు కూడా అనుమతుల కోసం దరఖాస్తులు వచ్చాయి. అంతర్జాతీయ బ్రాండ్లతో పాటు దేశీయంగా తయారయ్యే ఆర్థోస్ కలెక్టివ్ మాల్ట్ విస్కీ, శంకర్ డిస్టిలర్స్ వర్చాస్ అమెరికన్ విస్కీ, స్మోక్ ల్యాబ్ వోడ్కా, వివిధ ఫ్లేవర్డ్ వైన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
లిక్కర్ సరఫరాలో పారదర్శకత కోసం 121 బ్రాండ్ల వివరాలు, కంపెనీలు సమర్పించిన పత్రాలను TGBCL వెబ్‌సైట్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ట్రేడ్‌మార్క్ వివాదాలు తలెత్తకుండా సెప్టెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనుమతుల ప్రక్రియ పూర్తయి ఈ బ్రాండ్లు మార్కెట్లోకి వస్తే.. తెలంగాణ మద్యం మార్కెట్‌లో రేంజే మారిపోనుంది. దేశీ కిక్కుకు తోడు.. ఇక తెలంగాణలో విదేశీ కిక్కు కూడా అందుబాటులోకి రానుందన్నమాట!