PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 9:18 pm Posted by : PEOPLES DAIRY NEWS

మోతెలో దారుణం.. భార్యాభర్తల హత్య, మట్టిలో పూడ్చివేత!*

*మోతెలో దారుణం.. భార్యాభర్తల హత్య, మట్టిలో పూడ్చివేత!*

*మోతె , (పీపుల్స్ డైరీ):* మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు భార్యాభర్తలను దారుణంగా హత్య చేసి, మట్టిలో పూడ్చిపెట్టిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు, బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని బిక్యా తండాకు చెందిన హలవత్ నాగు (53), హలవత్ బుబా (46) దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అనంతరం ఆధారాలు లభించకుండా ఉండేందుకు మండల కేంద్రంలోని నేషనల్ హైవే (జాతీయ రహదారి) పక్కన ఉన్న ఒక వ్యవసాయ భూమిలో వారి శవాలను పూడ్చిపెట్టారు.వ్యవసాయ పనుల్లో భాగంగా నాటు వేసేందుకు వెళ్లిన కూలీలు అక్కడ మట్టిలో పూడ్చిపెట్టిన మృతదేహాలను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కూలీలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు.కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మునగాల సీఐ రామకృష్ణ రెడ్డి, మోతే ఎస్ఐ లచ్చి రెడ్డి, తహసీల్దార్ ఎం. వెంకన్నలతో కలిసి ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం తహసీల్దారు సమక్షంలో మట్టిలో పూడ్చిపెట్టిన శవాలను వెలికితీశారు.ఈ దారుణ ఘటనపై జిల్లా ఎస్పీ నర్సింహా విలేకరులతో మాట్లాడుతూ మృతుల వివరాలను వెల్లడించారు. బాధితుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మునగాల సీఐ రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.