PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 7:05 am Posted by : PEOPLES DAIRY NEWS

అన్నపై తమ్ముడి కత్తి వేటు!

గొర్లవీడులో రాజకీయ చిచ్చు.. అన్నదమ్ముల మధ్య ఘర్షణ
– కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ విభేదాలతో రగిలిన వివాదం?
– రమేశ్‌పై తిరుపతి కత్తితో దాడి చేసినట్లు సమాచారం
– తీవ్ర రక్తస్రావంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
– గ్రామంలో ఉద్రిక్తత.. రంగంలోకి దిగిన పోలీసులు
– ఘటనపై వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం

పీపుల్స్ డైరీ, భూపాలపల్లి:

అన్నదమ్ముల మధ్య రాజకీయ విభేదాలు ఘర్షణకు దారితీసి.. చివరకు కత్తి దాడికి కారణమైన ఘటన భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో సోమవారం చోటుచేసుకున్నట్లు సమాచారం. గ్రామానికి చెందిన నలిమెల రమేశ్‌ పై ఆయన తమ్ముడు నలిమెల తిరుపతి కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రమేశ్‌ కు తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం ప్రకారం.. రమేశ్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తిగా, తిరుపతి బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. కొంతకాలంగా రాజకీయ అంశాలపై అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం ఇరువురి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తిరుపతి కత్తితో రమేశ్‌ పై దాడి చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కత్తి దాడిలో రమేశ్‌ కు గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనతో గొర్లవీడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. దాడికి అసలు కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.