PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 8:01 am Posted by : PEOPLES DAIRY NEWS

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల నిరసన

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల నిరసన

– బొగ్గు, బూడిద నిర్వహణ టెండర్ల రద్దుకు డిమాండ్

– నల్ల బ్యాడ్జీలతో ఆందోళన…

*గణపురం, జూన్ 19 (పీపుల్స్ డైరీ):*

కేటీపీపీలోని వైటీపీఎస్ విద్యుత్ కేంద్ర పరిధిలో బొగ్గు, బూడిద నిర్వహణ విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే టెండరు ప్రక్రియను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ (జేఏసీ) కేంద్ర కమిటీ పిలుపుమేరకు కేటీపీపి శాఖ ఆధ్వర్యంలో ప్రధాన గేటు ఎదుట ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ… విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు, బూడిద నిర్వహణ విభాగాలు అత్యంత కీలకమైనవని, అవి విద్యుత్ కేంద్రానికి ప్రాణాధారమని పేర్కొన్నారు. అలాంటి విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల అనుభవం కలిగిన శాశ్వత సిబ్బందిని పక్కనపెట్టే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ప్రైవేటీకరణ వల్ల పని భారం అసమానంగా పెరగడంతో పాటు భద్రతా ప్రమాణాలు దెబ్బతినే అవకాశం ఉందని, తద్వారా విద్యుత్ కేంద్ర భద్రతకే ముప్పు వాటిల్లవచ్చని హెచ్చరించారు. ప్రజా రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రైవేటీకరణ చర్యలు చేపట్టడం సమంజసం కాదన్నారు. బొగ్గు, బూడిద నిర్వహణ విభాగాల టెండరు ప్రక్రియను వెంటనే రద్దు చేసి, శాశ్వత సిబ్బందితోనే నిర్వహణ కొనసాగించాలని ప్రభుత్వం, ఉన్నతాధికారులను కోరారు. ఇది ఒక్క విద్యుత్ కేంద్రానికి సంబంధించిన సమస్య కాదని, రానున్న రోజుల్లో విద్యుత్ రంగంలోని ఇతర కీలక విభాగాలను కూడా ప్రైవేటు చేతుల్లోకి అప్పగించేందుకు ఇది తొలి అడుగుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను యాజమాన్యం పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఉద్యోగులు స్పష్టం చేశారు.