PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 9:50 pm Posted by : PEOPLES DAIRY NEWS

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎక్మో చికిత్స

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ఎక్మో (ECMO) విధానంలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిపుణులైన వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈరోజే గుండెపోటుకు గురైన పెద్ది సుదర్శన్ రెడ్డిని తొలుత హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక వైద్య సదుపాయాలు ఉన్న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఎక్మో సపోర్ట్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఎక్మో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్) విధానం ద్వారా గుండె, ఊపిరితిత్తుల పనితీరుకు తాత్కాలికంగా సహాయం అందుతుంది. ఈ ప్రక్రియలో శరీరం వెలుపల రక్తానికి ఆక్సిజన్ అందించి, కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించడం ద్వారా గుండె, ఊపిరితిత్తులపై ఒత్తిడిని తగ్గించేందుకు సహకరిస్తుంది. వైద్య నిపుణుల పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్ రెడ్డికి అవసరమైన అన్ని రకాల చికిత్సలు అందుతున్నాయని, ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు సమాచారం.