PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 11:57 am Posted by : PEOPLES DAIRY NEWS

కస్తూర్బాలో కలకలం.. అర్ధరాత్రి ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం

సీసీ కెమెరాలు ఉన్నా గోడ దూకి వెళ్లిపోయినట్లు సమాచారం..

ఉదయం పోలీసులకు సమాచారం.. గాలింపు చేపట్టిన పోలీసులు.. ఆందోళనలో తల్లిదండ్రులు

హన్మకొండ జిల్లాలోని శాయంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అర్ధరాత్రి ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమైనట్లు తెలిసింది… ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. హాస్టల్‌లో ఉంటున్న 6, 7, 8వ తరగతులకు చెందిన ముగ్గురు విద్యార్థినులు అర్ధరాత్రి సమయంలో హాస్టల్ ప్రహరీ గోడ దూకి వెళ్లిపోయినట్లు హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు.

పాఠశాలలో సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ విద్యార్థినులు ఎలా బయటకు వెళ్లగలిగారనే అంశంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భద్రతా వ్యవస్థలో ఏమైనా లోపాలున్నాయా అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.విద్యార్థినులు కనిపించకపోవడంతో హాస్టల్ సిబ్బంది ఉదయం తనిఖీలు నిర్వహించగా విషయం వెలుగులోకి వచ్చింది.అనంతరం ఉదయం సుమారు 5 గంటలకు పాఠశాల ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ, విద్యార్థినుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. సమీప ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది..