రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నల్లబెల్లి మండలం లెంకాలపల్లి గ్రామ సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి చికిత్స పొందుతూ కన్నుమూశారు.
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం… నర్సంపేట మండలం ఇటుకాలపల్లి నుంచి నారక్కపేట వెళ్లే మార్గంలోని బ్రిడ్జి సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న సర్పంచ్ విజయలక్ష్మి, ఆమె భర్త రవీందర్‌ను ఒక గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా వారిని వరంగల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సర్పంచ్ విజయలక్ష్మి ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె భర్త రవీందర్ పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉండటంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
సర్పంచ్ విజయలక్ష్మి అకస్మాత్తుగా మృతి చెందడంతో లెంకాలపల్లి గ్రామంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, ఢీకొట్టి పరారైన వాహనం కోసం దర్యాప్తు చేపడుతున్నారు.