PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 8:13 pm Posted by : PEOPLES DAIRY NEWS

ట్రాక్టర్‌పై నుంచి జారి మెకానిక్ మృతి

ట్రాక్టర్‌పై నుంచి జారి మెకానిక్ మృతి

– చికిత్స పొందుతూ ట్రాక్టర్ మెకానిక్ వెంకన్న మృతి

– గ్రామాన్ని కలిచివేసిన వెంకన్న మరణం

– అందరితో ఆప్యాయంగా మెలిగే వెంకన్న…

– గణపురంలో విషాదం…

 

గణపురం, జున్ 14 (పీపుల్స్ డైరీ): ట్రాక్టర్‌పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడిన ఓ మెకానిక్ తీవ్ర గాయాలతో నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూశాడు. ఈ విషాద ఘటన గణపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గణపురం మండల కేంద్రానికి చెందిన ఎర్రంరాజు వెంకటేశ్వర రాజు (వెంకన్న 54) ట్రాక్టర్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 12న నగరంపల్లి – అప్పయ్యపల్లి గ్రామాల మధ్య నూతనంగా నిర్మించిన రహదారికి వాటర్ క్యూరింగ్ పనులు నిర్వహిస్తుండగా, తాను నడుపుతున్న ట్రాక్టర్‌పై నుంచి ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయాడు. దీంతో ట్రాక్టర్‌కు చెందిన భారీ వెనుక టైరు అతని శరీరంపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

 

– అందరితో ఆప్యాయంగా మెలిగే వెంకన్న…

 

గ్రామంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తిగా వెంకన్నకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ట్రాక్టర్ మెకానిక్‌ గా ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తూ రైతులు, వాహన యజమానులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు ముందుండి సహాయం చేసే స్వభావం కారణంగా గ్రామస్తుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. వెంకన్న మృతి వార్త తెలిసిన వెంటనే బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తూ నివాళులర్పించారు. ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబంలోనే కాకుండా గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది.