PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 4:48 pm Posted by : PEOPLES DAIRY NEWS

రేపు నల్లబెల్లికి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్

-పెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసా
-రేపు నల్లబెల్లికి మాజీ సీఎం.. పిల్లల భవిష్యత్తుకు పార్టీ అండ
-రూ.2.25 కోట్ల ఆర్థికసాయం అంద‌జేయాల‌ని నిర్ణ‌యం
-సంస్మరణ సభకు అగ్రనేతలు… కీల‌క రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధినేత కేసీఆర్‌ అండగా నిలిచారు. కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్లు, వరంగల్‌ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేవలం ఆర్థిక సాయంతోనే కాకుండా పిల్లల భవిష్యత్తు, వారి చదువులు, కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా ఉంటుందని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని ఎల్లకాలం పార్టీ ఆదుకుంటుందని స్పష్టం చేశారు.

దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం జిల్లా పార్టీ ముఖ్య నేతలు సమావేశమై కుటుంబ సంక్షేమానికి సంబంధించిన తదుపరి చర్యలపై నిర్ణయాలు తీసుకుంటారని కేసీఆర్‌ తెలిపారు. కుటుంబానికి కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్లను ఆర్థిక సహాయంగా అందించాలని నిర్ణయించారు. అదే సమయంలో వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లి శ్రీమతి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను ఆమె పేరుతో బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. దీంతో మొత్తం రూ.2.25 కోట్లను పెద్ది కుటుంబానికి పార్టీ తరఫున అందించనున్నారు.

నల్లబెల్లిలో పెద్ది కుటుంబాన్ని పరామర్శించనున్న బీఆర్‌ఎస్ అధినేత

నర్సంపేట: స్వర్గీయ పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రేపు (ఆగస్టు 9) నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లికి వెళ్లనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తనకు అత్యంత సన్నిహితుడిగా, నిబద్ధతతో పనిచేసిన పెద్ది మృతితో విషాదంలో ఉన్న కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పనున్నారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ది అభిమానులకు కూడా భరోసా ఇవ్వనున్నారు.

సంతాప సభ, 40 వేల మందికి భోజన సదుపాయం…

పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ సందర్భంగా నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్న సంతాప సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయిబాబా ఆలయం వెనుక, రెడీమిక్స్‌ ప్లాంట్‌ పక్కన సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నర్సంపేట నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ది అభిమానులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, సహచరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో సుమారు 40 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం నల్లబెల్లిలో మూడు ప్రత్యేక భోజన స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.

నేతలకు మండలాల వారీగా బాధ్యతలు…

సంతాప సభ ఏర్పాట్లు, జన సమీకరణను పర్యవేక్షించేందుకు బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలకు మండలాల వారీగా బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్‌, బానోతు శంకర్‌నాయక్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరూరి రమేష్‌ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.

 

కార్యకర్తల్లో భరోసాపై చర్చ

పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆకస్మిక మరణంతో నర్సంపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్‌ కార్యకర్తల్లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో సంస్మరణ సభకు ప్రాధాన్యం ఏర్పడింది. పెద్ది రాజకీయ వారసత్వం, పార్టీ కార్యకర్తల భవిష్యత్తుపై కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ఎలాంటి సంకేతాలు ఇస్తారన్న చర్చ జరుగుతోంది. కుటుంబానికి ఆర్థిక అండ ప్రకటించిన పార్టీ అధినాయకత్వం.. నియోజకవర్గ పార్టీ శ్రేణులకు కూడా భరోసా కల్పించేలా ఏమైనా నిర్ణయం ప్రకటిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన పెద్ది సుదర్శన్‌రెడ్డి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 2018లో నర్సంపేట నుంచి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు 2016లో తెలంగాణ సివిల్‌ సప్లయ్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. గత నెల 26న ఛాతీలో నొప్పితో అస్వస్థతకు గురైన ఆయనకు హనుమకొండలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించగా ఐదు రోజుల పాటు చికిత్స పొందుతూ గత నెల 31న కన్నుమూశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్‌ నల్లబెల్లికి రానుండటంతో రాజకీయంగా కూడా ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.