PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 5:21 pm Posted by : PEOPLES DAIRY NEWS

గుంతలు… కలుషిత నీరు…

గుంతలు… కలుషిత నీరు…

– పనులు ముగిసినా… గుంతలు అలాగే…!
– ధర్మరావుపేటలో కలుషిత నీటి కష్టాలు
– మురుగు నీరు కలుస్తోందని గ్రామస్థుల ఆరోపణ
– పగిలిన తాగునీటి పైప్‌లైన్‌కు మరమ్మతులు కరువు
– మురుగు నీరు నిల్వతో అంటువ్యాధుల భయం
– బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి
– రోజులైనా మరమ్మతులు చేపట్టని అధికారులు
– వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి

పీపుల్స్ డైరీ, గణపురం:

గణపురం మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనారోగ్యంలో పడుతున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో తాగునీటి పైప్‌లైన్ పగిలిపోయి చాలా రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు, గ్రామ సిబ్బంది పట్టించుకోకపోవడంతో మురుగు నీరు తాగునీటిలో కలిసే పరిస్థితి నెలకొన్నదని ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామ ప్రజలు కలుషిత నీటిని వినియోగించాల్సి వస్తోందని, చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నిర్వహించిన వడ్ల కొనుగోలు కేంద్రానికి లారీలు రాకపోకలు సాగించే సమయంలో తాగునీటి పైప్‌లైన్ దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. వడ్ల కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత పైప్‌లైన్‌ను మరమ్మతు చేయకుండా, తవ్విన గుంతలను పూడ్చకుండా అలాగే వదిలేయడం పట్ల గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పనుల కోసం ప్రజలకు ఇబ్బందులు కలిగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పైప్ పగిలిన ప్రాంతంలో ఏర్పడిన గుంతల్లో మురుగు నీరు నిల్వ ఉండటంతో పాటు దూడలు, బర్రెలు, ఇతర పశువులు తిరుగుతుండటంతో దుర్వాసన వెదజల్లుతోందని గ్రామస్థులు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో ఆ గుంతల్లో నిలిచిన నీటిలో దోమలు విపరీతంగా పెరిగే అవకాశం ఉండటంతో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి పైప్ పగిలి రోజులు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామస్థులు మండిపడుతున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ, సంబంధిత శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోందని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా, వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సంబంధిత కళ్లం ఇన్‌చార్జిపై విచారణ జరిపి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పగిలిన పైప్‌లైన్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టి, గుంతలను పూడ్చివేసి, గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రస్తుతం ధర్మరావుపేటలో నెలకొన్న పరిస్థితిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.