PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 11:19 am Posted by : PEOPLES DAIRY NEWS

కొండా వ్యవహారంపై అధిష్టానానికి నివేదిక!

  • కొండా వ్యవహారంపై అధిష్టానానికి నివేదిక!
  • మంత్రి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు…?
  • నివేదికలో ఉన్నది అదేనా..?

    పీపుల్స్​డైరీ–వరంగల్​ : తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలి మరోసారి హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఆమె కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇప్పుడు పార్టీ అధిష్టానం వరకు వెళ్లింది. కుమార్తె వ్యాఖ్యలను సురేఖ బహిరంగంగా ఖండించకపోవడం, షోకాజ్‌ నోటీసులపై వివరణ ఇవ్వడం, తనపై కుట్ర జరుగుతోందంటూ లేఖ రాయడం పార్టీ వర్గాల్లో మరింత చర్చకు దారితీసింది. ఈ పరిణామాలపై పీసీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వివాదాలను మరింత పెంచుతున్నారనే అభిప్రాయంతో ఏఐసీసీకి తాజా నివేదిక పంపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు వచ్చినా వాటిని ఖండించకపోవడం, పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం సరికాదని పీసీసీ, క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై ఏఐసీసీ అంతర్గతంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. మరోవైపు వరంగల్‌ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా కొండా సురేఖతో సమన్వయం కష్టంగా మారిందని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సురేఖపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారా? మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయా? అనే చర్చ తెలంగాణ కాంగ్రెస్‌లో జోరందుకుంది. కొండా సురేఖతో పాటు చిన్నారెడ్డి వ్యవహారంపైనా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో.. కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఈ ఎపిసోడ్ ఎటు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.