రోడ్డు భద్రత… ప్రతి ఒక్కరి బాధ్యత…
– హెల్మెట్ ధరించండి… ప్రాణాలు కాపాడుకోండి…
– జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకిర్త్ ఐపీఎస్
– హెల్మెట్ లేకుంటే చర్యలు తప్పవు
– భూపాలపల్లిలో ‘అరైవ్ అలైవ్’ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం
– 100 మంది ద్విచక్ర వాహనదారులపై కేసులు..
– మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా
– ఇద్దరు మైనర్లు అదుపులో
పీపుల్స్ డైరీ, భూపాలపల్లి:
రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ, రోడ్డు రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ ప్రత్యేక డ్రైవ్‌ను శనివారం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో చేపట్టిన ఈ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రత్యేక తనిఖీల్లో భాగంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని నిలిపివేసి, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 100 మంది ద్విచక్ర వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఈ డ్రైవ్ లో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని వారి తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ… రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. మైనర్ల చేత వాహనాలు నడిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి.. సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోండి’ అంటూ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి సంపత్ రావు, ఆర్టీవో శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
