PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 6:11 pm Posted by : PEOPLES DAIRY NEWS

కూతురిని ప్రభుత్వ బడిలో చేర్పించిన సర్పంచ్

ప్రభుత్వ పాఠశాలలో తమ కూతురికి అడ్మిషన్ తీసుకుంటున్న సర్పంచ్ శ్రీలత అశోక్

 

 

– బుద్ధారం గ్రామంలో ఆదర్శంగా నిలిచిన సర్పంచ్ శ్రీలత అశోక్
– ఐదో తరగతిలో కుమార్తెకు ప్రవేశం
– ఇతర తల్లిదండ్రులకు మార్గదర్శకంగా సర్పంచ్ నిర్ణయం
– ప్రభుత్వ పాఠశాలల వైపు అడుగులు వేయాలని పిలుపు
– ఉపాధ్యాయులు, గ్రామస్థుల హర్షం
– నాణ్యమైన విద్యకు ప్రభుత్వ బడులే వేదిక
– బడిబాట కార్యక్రమానికి మరింత ఊతం
– ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న ప్రజల నమ్మకం

గణపురం, జున్ 17 (పీపుల్స్ డైరీ):

ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులపై తనకున్న విశ్వాసాన్ని బుద్ధారం గ్రామ సర్పంచ్ విడిదినేని శ్రీలత అశోక్ ఆచరణలో చూపించారు. బుధవారం మండలంలోని బుద్ధారం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో తన కుమార్తెకు ఐదో తరగతిలో ప్రవేశం కల్పించి ఇతర తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందనే సందేశాన్ని సమాజానికి చాటాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ బడుల్లో మెరుగైన బోధన, ఆధునిక సదుపాయాలు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. సర్పంచ్ తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం పట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవీందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ముందుండి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని చాటడం అభినందనీయమని అన్నారు. ఈ నిర్ణయం గ్రామంలో మరింత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రోత్సాహకంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు సైతం సర్పంచ్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ప్రభుత్వ విద్యపై విశ్వాసానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మారబోయిన ఐలయ్య ,అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు ,వార్డ్ మెంబర్స్ ,గ్రామ ప్రముఖులు, యువజన సంఘాల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.