PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 8:15 pm Posted by : PEOPLES DAIRY NEWS

*”స్టెతస్కోప్ చేతిలో… సేవ గుండెల్లో – 40 ఏళ్ల అటవీ వైద్యుని యజ్ఞం”*

*”స్టెతస్కోప్ చేతిలో… సేవ గుండెల్లో – 40 ఏళ్ల అటవీ వైద్యుని యజ్ఞం”*

*పిడుగులు, అడవి జంతువులను దాటి నక్సల్ కాలంలోనూ ఆగని వైద్యం*

*వరంగల్, నల్లబెల్లి:శనిగరం*

ఎంబిబిఎస్ డిగ్రీ లేదు. పెద్ద హాస్పిటల్ లేదు. కోట్లు లేవు. కానీ మూడు తరాల ప్రజల గుండెల్లో *”డాక్టర్ సార్”* గా నిలిచాడు. స్టెతస్కోప్ ఒక చేతిలో, ఒకప్పుడు ప్రాణరక్షణ కోసం గన్ మరో చేతిలో పట్టి, నేడు పక్షవాతంతో ఒంటి చేత్తోనే రోగులకు సేవ చేస్తున్నాడు.

అతనే వరంగల్ జిల్లా నల్లవెల్లి మండలం *శనిగరం గ్రామానికి చెందిన కడియాల నాగేశ్వరావు*.
40 సంవత్సరాలుగా మారుమూల అటవీ గ్రామాలకు వైద్య దేవుడిగా వెలుగుతున్నాడు. ఆయన సేవకు “గౌరవ డాక్టరేట్” ఇచ్చి సత్కరించక తప్పదు.

*యవ్వనం – ఉద్యమం – కరాటే*

*కమ్యూనిస్టు భావజాలం నుండి వైద్య యోధుడిగా*
1970 లలో గ్రామంలో కాంగ్రెస్ – కమ్యూనిస్టు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగేవి. ఆ సమయంలో *పుచ్చలపల్లి సుందరయ్య* గారి CPM భావజాలకు ఆకర్షితులైన నాగేశ్వరావు యువ నాయకుడిగా ఎదిగారు. కాంగ్రెస్ వర్గీయుల దాడులను ఎదుర్కొన్నారు.

16 ఏళ్ల వయసులోనే హనుమకొండలో *కరాటే బ్లాక్ బెల్ట్* సాధించారు. ఆ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఆయన జీవితాంతం తోడయ్యాయి.
*”బ్రూస్లీ” గా పిలిచేవారు*
ఆ రోజుల్లో *బ్రూస్ లీ* సినిమాలకు బాగా ఆకర్షితులయ్యారు. _Enter the Dragon, Return of the Dragon_ లాంటి సినిమాలు హనుమకొండ థియేటర్లలో చూసి, ఆయన ఫోటోలను ఇంటి గోడలకు అంటించుకునేవారు. బ్రూస్ లీ లాగే ఉండాలని కరాటే నేర్చుకున్నారు.

తర్వాత శనిగరం గ్రామంలో కూడా 70-80 లలో కొంతమంది యువతకు కరాటే క్లాసులు నేర్పించారు. అందుకే అప్పుడు అందరూ సరదాగా ఆయన్ని *”బ్రూస్లీ”* అని పిలిచేవారు. ఆ కరాటే క్రమశిక్షణే తర్వాత ఆయనకు అడవిలో, ఉద్యమ కాలంలో రక్షణగా నిలిచింది.

80-90 లలో నక్సలిజం ఉగ్రరూపం దాల్చింది. పీపుల్స్ వార్ సభ్యులు ఇంటికి వచ్చి ఉద్యమంలోకి రమ్మని బలవంతం చేశారు. కాదంటే కుటుంబానికి ముప్పు, ఒప్పుకుంటే పోలీస్ ఎన్కౌంటర్ భయం.

ఈ రెండింటి మధ్య నలిగిన నాగేశ్వరావు, ఉద్యమంలోకి నేరుగా వెళ్లకుండా *”వైద్య రూపంలో సహాయం”* చేయాలని నిర్ణయించుకున్నారు. అదే ఆయనకు రక్షణ కవచం అయింది.

ఆ రోజుల్లో సైకిల్ పై రెండు తెల్ల డబ్బాలు ఉండేవి. ఒకదానిలో స్టెతస్కోప్, మందులు. మరో దానిలో మావోయిస్టులు ఇచ్చిన గన్. పొట్టకూటి కోసం, ప్రాణాలు దక్కించుకోవడం కోసం అది తప్పని పరిస్థితి. తర్వాత ఉద్యమం సద్దుమణిగి, పెద్ద లీడర్లు ఎన్కౌంటర్లలో మరణించడంతో ఆయన పూర్తిగా వైద్యానికే పరిమితమయ్యారు.

అటు కమ్యూనిస్టు క్లాసులు చెబుతూ, ఇటు పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తూ, మరోవైపు వైద్యం చేస్తూ… మూడు బాధ్యతలను ఒకేసారి మోశారు.
ఆ రోజుల్లో *అసెంబ్లీ టైగర్* గా పేరు తెచ్చుకున్న కమ్యూనిస్టు దిగ్గజ నేత *మద్దిగాయల ఓంకార్* గారు నర్సంపేట నియోజకవర్గం నుండి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఆ సమయంలో నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ – కమ్యూనిస్టు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగేవి. నల్లబెల్లి మండలంలో కూడా అలాంటి గొడవలు జరిగినప్పుడు నాగేశ్వరావు గారు కమ్యూనిస్టు పార్టీ తరఫున చురుగ్గా పాల్గొని, కమ్యూనిస్టు కార్యకర్తలను తన కరాటే ప్రోద్బలంతో కాపాడేవారు.

ఇదంతా అప్పటి పెద్దలు చెప్పుకునే కథ. మనకు అంతగా రికార్డులు లేకపోయినా, అది దాదాపు వాస్తవమే. ఆ రోజుల్లో ఆయన కమ్యూనిస్టు భావజాలానికి ఎంత కట్టుబడి ఉన్నారో దీనికి నిదర్శనం.

*సేవా యాత్ర – భయంకర రాత్రులు*

*పిడుగులు, అడవి జంతువులను దాటిన సేవ*
కొండాపురం, గోవిందాపురం, మూడు చెక్కల పల్లి, వేదనగరం, కన్నారావుపేట, శంషాబాద్, పంతులుపల్లి, మామిండ్ల వీరయ్య పల్లి తో సహా దాదాపు *12 అటవీ గ్రామాలకు* రోజుకు 30-40 కి.మీ సైకిల్ తొక్కేవారు.

కానీ అది సాధారణ ప్రయాణం కాదు. *వర్షం పడుతుంటే రోడ్లే కనిపించేవి కావు. పిడుగులు, ఉరుములు.* చేతిలో ఒక టార్చ్ లైట్. ఒకపక్క అడవి జంతువుల భయం. మరోపక్క కరెంటు లేని చీకటి. రోడ్డు లేకపోతే సైకిల్ ను *భుజం మీద పెట్టుకుని* వాగులు, గుట్టలు, ముళ్ల కంచెలు దాటేవారు.

అర్ధరాత్రి “అయ్యా జ్వరం”, “అయ్యా ప్రసవం” పాములు తేల్లు కుట్టిన అని కబురు వస్తే ప్రాణాలకు తెగించి వెళ్లేవారు. రోడ్లు, కరెంటు, చదువు లేని ఆ రోజుల్లో ఆయన స్టెతస్కోప్ ఏ ఆక్సిజన్ లాంటిది. “డాక్టర్ సార్ వస్తున్నారు” అంటే చాలు, గ్రామమంతా ధైర్యం తెచ్చుకునేది.

పెద్ద దెబ్బలు, పెద్ద జబ్బులు వచ్చినా ఆస్పత్రికి పంపకుండా నయం చేసే అనుభవం, అర్హత ఆయన సొంతం. 12 గ్రామాల ప్రజలు ఏకమై “మా డాక్టర్” అని గర్వంగా చెప్పుకునేవారు. ఇలాంటి సాహసం మరే ఆర్ఎంపీ చేయలేదు.

ప్రస్తుత పంచాయతీరాజ్ మంత్రి *ధనసరి అనసూయ “సీతక్క”* గారికి కూడా ఆ రోజుల్లో ఆయన వైద్యం అందించినట్లు స్థానికులు గుర్తు చేసుకుంటారు.

*కుటుంబం – త్యాగం – మానవత్వం*

*పేదల మనసు తో నడిచిన కుటుంబం*
భార్య *ధనలక్ష్మి*. ముగ్గురు పిల్లలు – పెద్ద కొడుకు *క్రాంతి కుమార్*, రెండవ కొడుకు *సురేష్ కుమార్*, కూతురు *మమత*. ముగ్గురినీ *గ్రాడ్యుయేట్స్* వరకు చదివించారు.
*అడవిలో నక్సల్ కాలపు భయానక రోజులు*
నక్సలైట్లు వైద్యం కోసం ఆయన్ని వారాల తరబడి తీసుకెళ్లేవారు. 10 రోజులు, 15 రోజులు, వారం రోజులు… ఇలా దట్టమైన అడవుల్లో ఎండనక, వాననక, పగలనక తిప్పేవారు. ఆకలితో అలమటిస్తూ, ఎలాంటి వసతులు లేకుండా అడవిలోనే ఉండాల్సి వచ్చేది.

ఇంట్లో భార్య, చిన్న పిల్లలు “ప్రాణాలతో తిరిగి వస్తాడో లేదో” అని ప్రాణభయంతో బిక్కుబిక్కుమని బతికేవారు. ఎన్నోసార్లు ఎన్‌కౌంటర్‌లో చిక్కుకునే పరిస్థితి వచ్చినా, దేవుడి దయతో తప్పించుకుని ప్రాణాలతో కుటుంబంలోకి తిరిగి వచ్చారు. అది నిజంగా పునర్జన్మే.

ఆటవీ ప్రాంతంలో నక్సలైట్లు తిప్పని ప్రాంతం అంటూ లేదు. ఎన్నో దట్టమైన కొండలు, వాగులు, వంకలు దాటుకుంటూ వారికి అక్కడే వైద్యం అందించారు. ఆ కాలం ఆయనకు రెండో జీవితాన్ని ఇచ్చింది.

*నరదిష్టి పేరుతో జరిగిన కుట్ర – న్యాయం గెలిచిన రోజు*
ఇది ఆయన జీవితంలో ఒక చేదు అనుభవం.

పిల్లలు పుట్టిన తర్వాత చిన్న పూరి గుడిసె ఇల్లు కట్టుకున్న కొత్తలో ఇంటి ముందుకు ఒక బిక్షగాడు వచ్చాడు. జ్యోతిష్యం కూడా చెప్పేవాడు. “మీకు నరదిష్టి ఉంది” అని చెప్పాడు.

కమ్యూనిస్టు కార్యకర్తగా మూఢనమ్మకాలను నమ్మని ఆయన, చిన్న పిల్లలు ఉన్నారనే ఆలోచనతో ఒక్కసారి మాత్రమే నమ్మారు. ఆ బిక్షగాడు “అర్ధరాత్రి రెండు నిమ్మకాయలు తీసుకుని నాలుగు బజార్ల కూడలిలో పెడితే నరదిష్టి పోతుంది” అన్నాడు. అలాగే చేశారు.

అదే సమయంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేకపోయారు. కరాటే బ్లాక్ బెల్ట్ ఉన్న ఆయన్ని ఎదురుగా ఎదుర్కోలేక, దొంగదెబ్బ తీయాలని ప్లాన్ చేశారు. ఒక టీంగా ఏర్పడి కల్పిత కథలు అల్లారు.

“ఇతనికి మంత్రాలు వస్తాయి. ఇతని వల్ల ఊరికి హాని జరుగుతుంది” అంటూ ఊరి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేసి, బహిరంగంగా అవమానించారు. ఆ రోజు ఆయన చాలా మానసికంగా కృంగిపోయారు.

కానీ న్యాయం, ధర్మం ఎప్పుడూ నిజాయితీపరుడి వైపే ఉంటాయి. మనోధైర్యంతో, కొంతమంది కమ్యూనిస్టు సీనియర్ నాయకుల మద్దతుతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అయింది.

విచారణలో అసలు నిజం బయటపడింది. కుట్ర చేసిన వారికి శిక్ష తప్పలేదు. చివరికి వారే ఊరి ప్రజల సమక్షంలో తప్పు ఒప్పుకుని, క్షమాపణ కోరారు.

“ఊరే కన్నతల్లి, దైవంతో సమానం” అని నమ్మే ఆయన పెద్ద మనసుతో వారిని క్షమించారు. ఆ సందర్భంతోనే పోలీసులు ఊరి ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చి “మూఢనమ్మకాలు వద్దు, సైన్స్ ను నమ్మండి” అని చెప్పారు.

అప్పుడే ప్రజలకు అర్థమైంది – “ఒక మంచి మనిషికి అనవసరంగా అవమానం జరిగింది” అని. ఆ రోజు నుండి ఆయన మంచితనం ఇంకా వెలుగులోకి వచ్చింది.

సైకిల్ మీద వచ్చిన సంపాదన అంతా పిల్లల చదువులకే సరిపోయింది. ప్రైవేట్ స్కూళ్లకు స్తోమత లేక ప్రభుత్వ బడుల్లోనే చదివించారు. ఇప్పటికీ *రేషన్ బియ్యం* తినే పరిస్థితి. గుంట భూమి లేదు, మంచి ఇల్లు లేదు.

ఆ రోజుల్లో ప్రజల దగ్గర డబ్బు ఉండేది కాదు. కానీ మానవత్వం ఉండేది. “డాక్టర్ సార్ పిల్లలు ఉన్నారు” అని కాయగూరలు, పప్పులు, పళ్లు, ధాన్యం తెచ్చి ఇచ్చేవారు. *”మానవ సేవయే మాధవ సేవ”* అన్నట్లు ఆదరించేవారు. ఆ కూరలతోనే కుటుంబం నడిచింది.

*తడిసిన 10 రూపాయల నోట్లతో నడిచిన కుటుంబం*
ఆనాడు ఆయన తిరిగి వైద్యం చేస్తే వచ్చేవి 10 రూపాయలు, 20 రూపాయలు, అయిదు రూపాయల నోట్లు మాత్రమే. 50 రూపాయల నోటు చూడడమే అరుదు. వర్షంలో తడిసి ముద్దైన ఆ నోట్లను ఇంటికి తెచ్చి కిరోసిన్ స్టవ్ పై చిన్న పెనం పెట్టి వేడి చేసి ఆరబెట్టేవారు.

ఇంజెక్షన్ కి 2 రూపాయలే తీసుకునేవారు. అంత కష్టపడి తెచ్చిన డబ్బుతోనే కుటుంబం నడిచేది. కానీ ఆ నోట్లలో డబ్బు కంటే ప్రజల ప్రేమ, మమత ఎక్కువగా ఉండేది.

40 ఏళ్ల క్రితం ఒక ఇంజెక్షన్ 2 రూపాయలతో మొదలుపెట్టారు. నేటికీ లాభాపేక్ష లేదు. కోట్లు సంపాదించిన ఆర్ఎంపీలు ఎందరో ఉన్నారు. కానీ ఆయన మిగిల్చింది మంచి పేరు మాత్రమే.

*పక్షవాతం కూడా ఆపలేకపోయింది*
10 ఏళ్ల క్రితం మొదటి పక్షవాతం. కాళ్లు, చేతులు పడిపోయాయి. ఏడాది మంచం. కరాటే క్రమశిక్షణతో కోలుకున్నారు. మళ్లీ సైకిల్ ఎక్కారు.
రెండోసారి పక్షవాతం తో ఇప్పుడు ఒక చేయి మాత్రమే పనిచేస్తుంది. అయినా “మీరే నా రెండు చేతులు” అంటూ వచ్చే రోగులతో ఇప్పటికీ వైద్యం చేస్తున్నారు.

“ఆయన చేయి పట్టుకుంటేనే మా జబ్బు తగ్గుతుంది” అని నమ్మే రోగులు నేటికీ ఇంటి తలుపు తడుతున్నారు.
*ప్రజాశక్తి చదివే కమ్యూనిస్టు కార్యకర్త*
ప్రతిరోజు ఉదయాన్నే రేడియో వార్తలు వినడం, అప్పట్లో ఉండే _ప్రజాశక్తి_ పత్రిక చదవడం ఆయన దినచర్యలో భాగం. కమ్యూనిస్టు క్లాసులకు తప్పకుండా హాజరయ్యేవారు.

ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా చాలా బలంగా ఉండేది. మూడు నాలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు అధికారంలో ఉండేవి. _ఢిల్లీ, కేరళ, కలకత్తా, మద్రాస్, చెన్నై, కన్యాకుమారి, బొంబాయి, ఖమ్మం, విజయవాడ, హైదరాబాద్_ ఇలా దేశంలో ఎక్కడ ఆల్ ఇండియా బహిరంగ సభ జరిగినా జనరల్ బోగీలో రైలు ప్రయాణం చేసి తప్పకుండా హాజరయ్యేవారు.

పార్టీ నాయకుల ప్రసంగాలను విని చక్కటి అవగాహన పెంచుకున్నారు. పార్టీలో అంతర్గతంగా చురుగ్గా పనిచేస్తూ, తన అన్న _కడియాల వీరాచారి_ గారు జిల్లా కమిటీ నాయకుడిగా ఉండటంతో, ఆయన నాయకత్వంలో కార్యకలాపాల్లో కీలకంగా పాల్గొనేవారు.

*గురువు డా. చింతకింది కుమారస్వామి*
ఇతనికి వైద్యం నేర్పిన గురువు _డా. చింతకింది కుమారస్వామి_ గారు. ఆయన కూడా కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు. ఆయన నాయకత్వంలోనే పార్టీ అంతర్గత వ్యవహారాల్లో పాల్గొని కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

ఒకపక్క వైద్యం, ఒకపక్క పార్టీ బాధ్యతలు, మరొకపక్క కుటుంబం… మూడుంటినీ నెట్టుకొచ్చారు. ఆ నిబద్ధత, అన్వేషణే ఆయన్ని 40 ఏళ్ల సేవా యోధుడిగా నిలబెట్టింది.*తమ్ముడికి కూడా వైద్యం – భావజాలం నేర్పిన అన్న*
నాగేశ్వరావు గారు తన తమ్ముడు *కడియాల మనోహర్* గారికి కూడా తనదైన శైలిలో RMP వైద్యం నేర్పించారు. కమ్యూనిస్టు భావజాలాన్ని కూడా అలవరిచి, తన బాటలోనే నడిపిస్తున్నారు.

అన్న సేవా మార్గాన్నే తమ్ముడు కొనసాగిస్తూ, గ్రామీణ ప్రజలకు వైద్యం అందిస్తున్నాడు.

*ప్రభుత్వానికి విజ్ఞప్తి*

*ఆ రోజులు వేరు… ఈ రోజులు వేరు*
ఆ రోజుల్లో డబ్బు లేకున్నా మర్యాద ఉండేది. వైద్యంలో విశ్వాసం ఉండేది. నేడు అంతా కార్పొరేట్ అయిపోయింది. డబ్బు మాయమైంది. కానీ నాగేశ్వరావు గారు నేటికీ అదే మానవత్వంతో వైద్యం చేస్తున్నారు.

*ప్రభుత్వం స్పందించాలి*
40 ఏళ్లు పిడుగులు, జంతువులు, నక్సల్ బెదిరింపులను దాటి ప్రజల ప్రాణాలు కాపాడిన ఈ యోధుడికి ఇప్పుడు వైద్య ఖర్చుల కోసం లక్షలు అవసరం.

ప్రభుత్వం ఒకవైపు ఆర్ఎంపీలు వైద్యం చేయవద్దంటోంది. మరోవైపు అవకాశాలు ఇస్తామంటోంది. కానీ ఆయన ఆరోగ్యం ఇప్పుడు సహకరించడం లేదు.వయస్సు 65 సంవత్సరాలు.

*కుటుంబ సభ్యుల విజ్ఞప్తి:* ప్రభుత్వం దయతలచి ఆర్థిక సహాయం, ఇల్లు, లేదా వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయం అందించాలి.

40 ఏళ్లు ప్రజలకు ప్రాణం పోసిన ఈ *”స్టెతస్కోప్ యోధుడికి”* ఇప్పుడు మన చేయూత అవసరం. ఆయనను మనం మరచిపోకూడదు.