PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 11:06 am Posted by : PEOPLES DAIRY NEWS

ముగ్గురు పసికందులు మృతి

ముగ్గురు పసికందులు మృతి

వెంటిలేటర్​ పేలి విషాదం

మహారాష్ట్రలోని అమరావతి ఆస్పత్రిలో ఘటన

పీపుల్స్​డైరీ–అమరావతి : మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ప్రభుత్వ మహిళా ఆసుపత్రిలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆసుపత్రి మూడో అంతస్తులోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (ఎస్ఎన్‌సీయూ)లో వెంటిలేటర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ సుమారు 39 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారు. ప్రమాదం కారణంగా వార్డులో దట్టమైన పొగ అలుముకుంది. ఊపిరాడక ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు. మంటలు చెలరేగిన వెంటనే వైద్యులు, నర్సులు, సిబ్బంది అప్రమత్తమై చిన్నారులను ఒక్కొక్కరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో సుమారు 30 మంది శిశువులను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు.

ఘటన విషయం తెలియగానే డీసీపీతో పాటు ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, ఆసుపత్రిలోని భద్రతా ఏర్పాట్లపై పూర్తి స్థాయి విచారణకు అధికారులు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషాద ఘటనపై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.