ఐటిడిఏను ముట్టడించిన ఆదివాసీలు
![]()
జీవో నెం. 3ని పునరుద్ధరించాలని డిమాండ్
1/70, పెసా, అటవీ హక్కుల చట్టాలను అమలు చేయాలి
ఆదివాసీ నిరుద్యోగ యువతకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలి
భూమిపుత్ర, గోండ్వాన, నాయకపోడు సంఘాల మద్దతు
ములుగు ప్రతినిధి, ఆగస్టు 17(పీపుల్స్ డైరీ):
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను, రాజ్యాంగబద్ధమైన చట్టాలను పరిరక్షించడంతో పాటు ఆదివాసీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సోమవారం ఏటూరునాగారం వై జంక్షన్ నుండి ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం ప్రాజెక్ట్ అధికారి లెనిన్ వత్సల్ టొప్పోకు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ.. ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక రక్షణలు సమర్థవంతంగా అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. జీవో నెం. 3ను పునరుద్ధరించి, ఆదివాసీ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసీల ఉద్యోగ, ఉపాధి హక్కులను కల్పించాలన్నారు. 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, గిరిజనేతరుల భూ దురాక్రమణలు, అక్రమ భూ బదలాయింపులను అరికట్టాలని కోరారు. లంబాడీలను ST జాబితా నుండి తొలగించాలనే డిమాండ్‌పై సమగ్ర విచారణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఐటీడీఏలను బలోపేతం చేసి, తగిన నిధులు, సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పించి, ఐటిడిఏ పరిధిలోని అన్ని శాఖలను సమర్థవంతంగా పనిచేసేలా చేయాలన్నారు. 1/70 చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాల్లో ఆదివాసీల రాజ్యాంగ హక్కులను పరిరక్షించే విధంగా తెలంగాణ ప్రభుత్వం తగిన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి సూచించారు. గిరిజన ప్రాంతాల్లో 1/70, పీసా, అటవీ హక్కుల చట్టం తదితర రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేసి, గ్రామసభలకు చట్టం కల్పించిన అధికారాలను సంపూర్ణంగా అమలు చేయాలన్నారు. ఆదివాసీ నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి, ఐటిడిఏ పరిధిలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఆదివాసీలు సాగు చేస్తున్న అటవీ భూములపై సమగ్ర సర్వే నిర్వహించి, అర్హులైన ఆదివాసీలకు హాక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. జీవో నెంబర్ 109 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసు ఉద్యోగాల్లో ఆదివాసీలకు 75% రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సాదా బైనామాకు సంబంధించిన జీవో నం. 76ను రద్దు చేయాలి. నిరుపేద ఆదివాసీలకు ఇంటి స్థలాలపై హక్కుపత్రాలు, పట్టాలు మంజూరు చేసి, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. గోదావరి వరదల వల్ల ప్రభావితమైన ఆదివాసీ కుటుంబాలకు సురక్షిత ప్రాంతాల్లో ఇంటి స్థలాలు కేటాయించి పునరావాసం కల్పించాలన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన అర్హత కలిగిన ఆదివాసీ కుటుంబాల సమస్యలను చట్టప్రకారం పరిశీలించి, అర్హులకు కుల ధృవీకరణ పత్రాలు మరియు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కులు కల్పించాలి. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్, జాతీయ అధ్యక్షులు వట్టం ఉపేందర్, జాతీయ ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య, జాతీయ ఉపాధ్యక్షులు యాసం రాజు, రాష్ట్ర కార్యదర్శులు చింత కృష్ణ, వట్టం జనార్ధన్, కార్యదర్శి పాయం జానకి రమణ, రాష్ట్ర నాయకులు పూనెం బాలకృష్ణ, సువర్ణపాక వెంకటరత్నం, రాష్ట్ర కార్యదర్శులు అరక శేషారావు, వెట్టి మనోజ్, మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమరం లక్ష్మీకాంత, మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుప లలిత, భూమిపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూనెం రామచందర్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు చందా మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి సలాం వరుణ్, నాయకపోడి సేవా సంఘం రాష్ట్ర నాయకులు బొల్లం సారయ్య, జిఎస్పీ జిల్లా అధ్యక్షులు పూనెం ప్రతాప్, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు సిద్ధబోయిన సర్వేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు కూచింటి చిరంజీవి, ఈక జగ్గారావు, బొగ్గుల బిక్షపతి, జిల్లా ఉపాధ్యక్షులు కాపుల సమ్మయ్య, తుడుందెబ్బ మండల అధ్యక్షులు తాటి నీలాద్రి, చందా నవీన్, ఆగబోయిన సాయికుమార్, చాప లక్ష్మణ్, కోరం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
