పచ్చని చెట్టు అనుకుంటే పొరపాటే.. అది పిచ్చి తీగలతో అల్లుకున్న కరెంట్ పోల్!
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై జంట గ్రామాల రైతుల ఆగ్రహం
నల్లబెల్లి / వరంగల్ జిల్లా:
దూరం నుంచి చూస్తే అది పచ్చగా దర్శనమిచ్చే ఒక చెట్టులా కనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళ్తే గానీ అసలు నిజం బోధపడదు. అది పచ్చని చెట్టు కాదు.. పిచ్చి తీగలు, పొదలతో నిండిపోయిన ఒక విద్యుత్ స్తంభం (కరెంట్ పోల్)!
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గోవిందాపురం – వేదనగరం గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారి పక్కన ఈ వింత దృశ్యం చోటుచేసుకుంది. కరెంట్ పోల్ను విద్యుత్ వైర్లతో సహా పిచ్చి తీగలు పూర్తిగా కప్పేసినా, ట్రాన్స్కో (Transco) అధికారులు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.నిత్యం కరెంట్ బిల్లుల వసూలు కోసం, ఇతర పనుల కోసం విద్యుత్ సిబ్బంది, అధికారులు ఇదే దారిలో రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, ఈ ప్రమాదకర కరెంట్ పోల్ వారి కంటికి కనిపించకపోవడం విచారకరం.విద్యుత్ తీగలకు పిచ్చి తీగలు అల్లుకోవడంతో షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో విద్యుత్ ప్రసారమై బాటసారులు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, పశువులకు ప్రాణహాని జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు పోయాకే స్పందిస్తారా? అంతవరకు పట్టించుకోరా?” అని జంట గ్రామాల రైతులు విద్యుత్ శాఖ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకముందే ట్రాన్స్కో అధికారులు తక్షణమే స్పందించి, కరెంట్ పోల్కు అల్లుకున్న పిచ్చి తీగలను తొలగించి, విద్యుత్ సరఫరాను సురక్షితంగా మార్చాలని గోవిందాపురం, వేదనగరం గ్రామాల ప్రజలు మరియు రైతులు డిమాండ్ చేస్తున్నారు.