నర్సంపేట మెడికల్ కాలేజీకి ‘పెద్ది సుదర్శన్ రెడ్డి’ పేరు పెట్టాలి: సిపిఐ జిల్లా కౌన్సిల్
- * నల్లబెల్లి మండల కేంద్రంలో పెద్ది చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు
- * ఆయన అకాల మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు: చింతకింది కుమారస్వామి
నల్లబెల్లి పీపుల్స్ డైరీ ఆగస్ట్ 01
నర్సంపేట నియోజకవర్గానికి మెడికల్ కళాశాల మంజూరు చేయించి, దాని నిర్మాణ పనులు పూర్తి కావడానికి అహర్నిశలు కృషి చేసిన మాజీ శాసనసభ్యులు స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి పేరును నర్సంపేట మెడికల్ కాలేజీకి పెట్టాలని సిపిఐ వరంగల్ జిల్లా కౌన్సిల్ సభ్యులు చింతకింది కుమారస్వామి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ఒప్పించి సుదర్శన్ రెడ్డి ఈ కళాశాలను సాధించారని ఆయన గుర్తుచేశారు.శనివారం మండల కేంద్రమైన నల్లబెల్లి గ్రామపంచాయతీ ఆవరణలో పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా చింతకింది కుమారస్వామి మాట్లాడుతూ…”పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు. రాజకీయాల్లో దారులు, సిద్ధాంతాలు వేరైనా తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిబద్ధతతో నిలబడిన నాయకుడు ఆయన. తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలోనూ ఆయన చేసిన కృషిని ఎవరూ విస్మరించలేరు.
తెలంగాణ ఉద్యమంలో సిపిఐ బలమైన పాత్ర పోషించిందని, వరంగల్ జిల్లాలో పెద్ది సుదర్శన్ రెడ్డి సిపిఐ పార్టీతో సమన్వయం చేసుకుంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. పెద్ది మరణం అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిచివేసిందని, ఆయన అంతిమయాత్రలో రాజకీయాలకతీతంగా ప్రజలు, నాయకులు పాల్గొనడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు.అలాగే, పెద్ది సుదర్శన్ రెడ్డి దహన సంస్కారాలను అధికారిక లాంఛనాలతో నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఇదే గౌరవంతో నర్సంపేట మెడికల్ కాలేజీకి ఆయన పేరును నామకరణం చేయాలని కోరారు. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును త్వరలోనే కలుస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా పెద్ది కుటుంబ సభ్యులకు సిపిఐ జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు మామిండ్ల పెద్ద ఐలయ్య, పరికి కోర్నేలు, మనుగొండ ప్రసాద్, కనకం సాల్మన్, ఓదెల రవి, కొనుకటి రమేష్, కాంగ్రెస్ నాయకులు బత్తిని మల్లయ్య, బద్రూ తదితరులు పాల్గొన్నారు.
