కార్మికులుండగానే బాంబ్ బ్లాస్టింగ్..!
– ఓసీ త్రీ గనిలో తప్పిన ప్రమాదం
– హెచ్చరిక లేకుండానే బ్లాస్టింగ్..!
– అధికారుల నిర్లక్ష్యం వల్లేనా…?
– అధికారుల తీరుపై ఆగ్రహం.. గని వద్ద ధర్నా
– ‘విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం’: ఇన్‌చార్జి మేనేజర్
గణపురం, జూలై 9 (పీపుల్స్ డైరీ):
గణపురం మండలంలోని ఓసీ- త్రీ ఓపెన్‌కాస్ట్ గనిలో కార్మికులు సమీపంలో ఉండగానే బాంబ్ బ్లాస్టింగ్ జరగడం తీవ్ర కలకలం రేపింది. క్షణాల్లో పెను ప్రమాదం తప్పడంతో కార్మికులు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడి గని వద్దే ధర్నాకు దిగారు. ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కార్మికుల వివరాల ప్రకారం.. ఓసీ త్రీలో మొత్తం 82 మంది కార్మికులు ఉండగా, ప్రస్తుతం 56 మందికే విధులు కల్పిస్తున్నారని, మిగిలిన 26 మందికి కూడా ఉపాధి కల్పించాలని వారు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి సింగరేణి జనరల్ మేనేజర్‌కు వారం రోజుల గడువు ఇచ్చినట్లు తెలిపారు. గడువు ముగియడంతో గురువారం కార్మికులు గని వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ సమయంలో అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే ప్రత్యామ్నాయ కార్మికులతో బ్లాస్టింగ్ నిర్వహించారని కార్మికులు ఆరోపించారు. బ్లాస్టింగ్ జరిగే సమయంలో భద్రతా నిబంధనల ప్రకారం కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాల్సి ఉన్నప్పటికీ, తాము అత్యంత సమీపంలో ఉండగానే పేలుళ్లు జరగడంతో ప్రాణభయంతో పరుగులు తీశామని తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, క్షణాల్లో భారీ ప్రమాదం తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్‌ను కావాలనే నిర్వహించారని ఆరోపిస్తూ కార్మికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం గని వద్దే ధర్నా నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఓసీ త్రీ ఇన్‌చార్జి మేనేజర్ శ్యాంసుందర్ స్పందిస్తూ, కార్మికులు సమీపంలో ఉండగా బ్లాస్టింగ్ జరగడం తప్పేనని అంగీకరించారు. ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
