*తపస్ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 80 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు*
*విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావనను పెంపొందించే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే: అన్నదానం సుబ్రహ్మణ్యం*
*ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో తపస్ ఎల్లప్పుడూ ముందుంటుంది: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య*
హన్మకొండ సెపెంబర్ 27( పీపుల్స్ డైరీ)
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఏబీవీపీ హాల్ (సామా జగన్మోహన్ స్మారక భవనం)లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తపస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు బత్తిని వీరస్వామి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య, ప్రధాన వక్తగా అన్నదానం సుబ్రహ్మణ్యం, విశిష్ట అతిథిగా జోనల్ ఇన్చార్జ్ వెంకటరమణారావు, డాక్టర్ సంగెం శ్రీనివాస్ హాజరయ్యారు.
విద్యార్థుల్లో విద్యతో పాటు దేశభక్తి, జాతీయ భావన, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ప్రధాన వక్త అన్నదానం సుబ్రహ్మణ్యం అన్నారు. ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తి కేవలం పాఠ్యాంశాలను బోధించడంతో పరిమితం కాదని, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత, మానవతా విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వంటి లక్షణాలను పెంపొందించడం ఉపాధ్యాయుల గురుతర బాధ్యత అని అన్నారు
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తపస్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి, ఉపాధ్యాయుల హక్కులు, సమస్యలు, సంక్షేమం కోసం తపస్ ముందుండి పోరాడుతుందని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయడం తపస్ ప్రధాన లక్ష్యమన్నారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పైన మొట్టమొదట ఉద్యమాన్ని చేసింది తపస్ అని గుర్తు చేశారు.ప్రస్తుత కాలంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానానికి చేరువవుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు కూడా నూతన బోధనా పద్ధతులను అవలంబిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలని ఆయన సూచించారు. పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో ఉపాధ్యాయుల సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు.
*80 మందికి పైగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం*
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లాలోని వివిధ యాజమాన్యాల పాఠశాలల్లో విశిష్ట సేవలు అందిస్తున్న 80 మందికి పైగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను తపస్ జిల్లా శాఖ ఘనంగా సత్కరించి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేసింది.
ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు), మోడల్ స్కూల్స్, మైనారిటీ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు తదితర అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల నుంచి ఎంపికైన ఉపాధ్యాయులను ఈ కార్యక్రమంలో సన్మానించారు.
విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల అభివృద్ధి, ఉత్తమ బోధనా పద్ధతుల అమలు, విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి చేసిన కృషి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి పురస్కరించడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయుల సేవలను గుర్తించి వారిని ప్రోత్సహించడం ద్వారా ఇతర ఉపాధ్యాయుల్లో కూడా మరింత ఉత్సాహం, బాధ్యతాభావం పెరుగుతుందని వారు అన్నారు. ఉపాధ్యాయుల కృషిని సమాజం గుర్తించడం వల్ల విద్యా రంగంలో మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్న తపస్ జోనల్ ఇన్చార్జి వెంకటరమణారావు,రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సంగెం శ్రీనివాస్ ,హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన తపస్ పూర్వ వరంగల్ జిల్లా అధ్యక్షులు పిన్నింటి బాలాజీ రావును ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో తపస్ రాష్ట్ర నాయకులు బత్తిని వెంకటరమణ గౌడ్, సుధాకర్, ఉప్పుల సతీష్, అంకం సతీష్, హనుమకొండ మహిళ విభాగ్ ఇంచార్జ్ అల్లం మాధవి , కోశాధికారి బాబురావు, జిల్లా మండల బాధ్యులు పాల్గొన్నారు.
