కాసం మాల్లో భద్రత డొల్ల!
– చిన్నారి బంగారు బిళ్ల మాయం!
– రూ.50 వేల బంగారం చోరీపై అనుమానాలు
– చిన్నారి మెడపై గాయం.. పోలీసులకు ఫిర్యాదు
– సీసీ కెమెరాల నిఘా ఏదీ?
– షాపింగ్ హంగులేనా.. భద్రత పట్టదా?
పీపుల్స్ డైరీ, భూపాలపల్లి:
ఆర్భాటంగా ప్రారంభోత్సవం.. ఆకర్షణీయమైన షాపింగ్ హంగులు.. వినియోగదారులను ఆకట్టుకునే ఏర్పాట్లు.. మరి భద్రత మాటేమిటి? ఇటీవల ప్రారంభమైన భూపాలపల్లిలోని కాసం షాపింగ్ మాల్లో చిన్నారి మెడలోని బంగారు బిళ్ల మాయమైనట్లు వెలుగులోకి వచ్చిన ఘటన ఇప్పుడు పలు ప్రశ్నలకు తావిస్తోంది. పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌కు వెళ్లిన చిన్నారి మెడలో సుమారు రూ.50 వేల విలువైన బంగారు బిళ్ల కనిపించకుండా పోవడం, తాడు కోసినట్లు ఉండటంతోపాటు మెడపై గాయం కనిపించిందని కుటుంబ సభ్యులు పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో మాల్లో భద్రతా ఏర్పాట్లపై చర్చ మొదలైంది.
– షాపింగ్ హంగులేనా.. భద్రత ఏదీ?
పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో షాపింగ్ మాల్స్‌కు వినియోగదారుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి రద్దీ సమయంలో వినియోగదారుల భద్రతకు తగిన ఏర్పాట్లు ఉన్నాయా? చిన్నపిల్లలతో వచ్చే కుటుంబాలకు భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాసం మాల్లో చిన్నారి బంగారు బిళ్ల మాయమైనట్లు వచ్చిన ఫిర్యాదు ఈ అంశాలను మరోసారి తెరపైకి తెచ్చింది. అయితే, ఇది చోరీనేనా? తాడును ఎవరు కోశారు? చిన్నారి మెడపై గాయం ఎలా ఏర్పడింది? అన్న విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
– సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా?
మాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా? ఘటన జరిగిన సమయంలోని దృశ్యాలను పరిశీలించారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. రద్దీ ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలను గుర్తించేందుకు నిఘా వ్యవస్థ కీలకం. చిన్నారి మెడలోని బంగారు బిళ్ల మాయమైన ఘటనలో సీసీ కెమెరాల పరిశీలన ద్వారా ఏమైనా ఆధారాలు లభిస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
– యాజమాన్యం స్పందించాలి.. పోలీసుల విచారణతోనే నిజాలు
వినియోగదారులు నమ్మకంతో షాపింగ్‌కు వచ్చే మాల్స్‌లో భద్రతా ఏర్పాట్లపై యాజమాన్యాలు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. చిన్నారి మెడపై గాయం కనిపించిందని కుటుంబ సభ్యులు చెబుతున్న నేపథ్యంలో ఘటనపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ ఘటనపై మంగళవారం భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత కుటుంబం తెలిపింది. మాల్ యాజమాన్యం స్పందన, సీసీ కెమెరాల పరిశీలన, పోలీసుల విచారణతోనే అసలు విషయం వెలుగులోకి రావాల్సి ఉంది. వినియోగదారుల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

