
భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు హత్యకు గురయ్యాడు. రంగయ్యపల్లి గ్రామానికి చెందిన జట్టి శ్రావణ్ (35) మండల కేంద్రంలోని వైన్ షాప్ సమీపంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.ప్రతిరోజులాగే శుక్రవారం రాత్రి దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శ్రావణ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. మృతదేహం సమీపంలో ఒక తల్వార్ కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది.ఈ ఘటనకు గల అసలు కారణాలు ఇంకా వెల్లడికాలేదు. హత్యలో ఎంతమంది పాల్గొన్నారు, దాడికి దారితీసిన పరిస్థితులు ఏమిటనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.మృతుడికి భార్య మౌనికతో పాటు ఒక కుమారుడు, ఒక కుమార్తెను వదిలి వెళ్లాడు. ఈ ఘటనతో రేగొండ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది.
