ePaper
Sunday, July 12, 2026
ePaper
Homeఎడిటోరియల్బైపాస్‌కు బ్రేకులెందుకు..?

బైపాస్‌కు బ్రేకులెందుకు..?

📰 Generate e-Paper Clip

 

– ప్రజల ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించడం లేదా..?

– బాంబులగడ్డ–లక్ష్మారెడ్డిపల్లి వరకు ప్రతిపాదిత బైపాస్

– గత ప్రభుత్వంలోనే పూర్తైన అనుమతుల ప్రక్రియ

– వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలి

– రెండున్నరేళ్లుగా ముందుకు కదలని నిర్మాణ పనులు

– ట్రాఫిక్, ప్రమాదాల నివారణకు బైపాస్ అత్యవసరం

– లేకుంటే ప్రజలతో కలిసి ఉద్యమం తప్పదని హెచ్చరిక

– బీఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు పోరెడ్డి పూర్ణచంద్రా రెడ్డి

 

గణపురం, జూన్ 9 (పీపుల్స్ డైరీ):

 

జిల్లా కేంద్రం భూపాలపల్లిలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ప్రతిపాదించిన బైపాస్ రోడ్డు నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై, అన్ని రకాల పరిపాలనా అనుమతులు పొందిన ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుకు కదలకపోవడంపై గండ్ర యువసేన జిల్లా అధ్యక్షుడు, బీఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజల అవసరాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులను రాజకీయ కోణంలో చూడడం సరికాదని, జిల్లా అభివృద్ధికి సంబంధించిన పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రత్యేక చొరవతో భూపాలపల్లి జిల్లా కేంద్రానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయించారని గుర్తు చేశారు. భూపాలపల్లి బాంబులగడ్డ నుంచి గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి వరకు నిర్మించనున్న ఈ బైపాస్‌కు అవసరమైన ఆర్థిక, రెవెన్యూ అనుమతులతో పాటు ఇతర శాఖల ఆమోదాలు కూడా లభించాయని తెలిపారు. ప్రాజెక్టు అమలుకు అన్ని అడ్డంకులు తొలగిపోయినప్పటికీ, ప్రస్తుతం పనులు ప్రారంభం కాకపోవడం వెనుక కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రం రోజురోజుకూ విస్తరిస్తోందని, వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా భారీ వాహనాలు పట్టణం గుండా ప్రయాణించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సేవలకు సంబంధించిన అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. పట్టణంలో ట్రాఫిక్ ఒత్తిడి పెరగడంతో పాటు రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా అధికమవుతోందని ఆయన పేర్కొన్నారు. బైపాస్ రోడ్డు అందుబాటులోకి వస్తే భారీ వాహనాల రాకపోకలు పట్టణానికి వెలుపలికి మళ్లి, ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రమాదాల నివారణకు కూడా దోహదపడుతుందని వివరించారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, అభివృద్ధి పనుల విషయంలో రాజకీయ కక్షసాధింపులకు తావు ఉండకూడదని అన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులను పక్కనపెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పేర్కొన్న ఆయన, భూపాలపల్లి ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న బైపాస్ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఈ అంశంపై స్పష్టత ఇచ్చి, పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో ప్రజలకు వెల్లడించాలని కోరారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి ఉద్యమ బాట పడుతుందని, ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి హెచ్చరించారు. భూపాలపల్లి అభివృద్ధికి కీలకమైన బైపాస్ రోడ్డు నిర్మాణం ఇకపై మరింత ఆలస్యం కాకుండా వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!