• కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి
• 10 లక్షల ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి
• తహసీల్దార్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రం సమర్పణ
నల్లబెల్లి: ఆగస్టు 11, (పీపుల్స్ డైరీ)
నల్లబెల్లి: దేశంలో నానాటికీ పెరుగుతున్న నిత్యవసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, రైతులు, కార్మికులు మరియు నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ, సిపిఎం పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీల మండల కమిటీల ఆధ్వర్యంలో నల్లబెల్లి మండల కేంద్రంలో భారీ ధర్నా నిర్వహించారు.ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు చింతకింది కుమారస్వామి మరియు సిపిఎం నాయకులు కడియాల మనోహర్ పాల్గొని మాట్లాడారు.రైతులకు కల్తీ లేని విత్తనాలు, కాంప్లెక్స్ ఎరువులు అందించాలని, కరువు ప్రాంతాల్లోని రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 35% మాత్రమే పంటలు కొంటామని అనడం రైతు వ్యతిరేక విధానమేనని, రైతులు పండించిన పంటలను 100% కొనుగోలు చేయాలని మరియు పంట నిల్వల కోసం తగినన్ని గోదాములను నిర్మించాలని డిమాండ్ చేశారు.దశాబ్దాల తరబడి కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఈ లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం ద్వారా కాంగ్రెస్, బీజేపీ రెండూ కార్మిక వ్యతిరేక పార్టీలేనని తేలిపోయిందని విమర్శించారు.ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నెరవేర్చకపోగా, నేటికీ ఖాళీగా ఉన్న 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం నిరుద్యోగ యువతను వెన్నుపోటు పొడవడమేనని మండిపడ్డారు.ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నల్లబెల్లి మండల తహసీల్దార్ ద్వారా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం మండల నాయకులు బొడిగె సమ్మయ్య, మామిళ్ల పెద్ద ఐలయ్య, కడియాల క్రాంతి కుమార్, ఇస్లావత్ రవి, ఆవాల సంపత్రావు, గట్టి పాపయ్య, మర్రి రమేష్, బొడిగె నారాయణస్వామి, దిండు బాబు, కనకం సాగర్, కత్తి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
