ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeతెలంగాణభారీ వర్షాలకు రెడీ...

భారీ వర్షాలకు రెడీ…

📰 Generate e-Paper Clip

భారీ వర్షాలకు రెడీ…

  • తెలంగాణకు రెయిన్ అలర్ట్
  • అల్పపీడనంతో రెండు రోజుల పాటు వర్షసూచన
  • పలు జిల్లాల్లో సోమవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలు…

పీపుల్స్​డైరీ–హైదరాబాద్​ : గత కొన్ని రోజులుగా వానలు తగ్గుముఖం పట్టినా.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరోసారి వర్షాలు విస్తృతమయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. సోమ, మంగళవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇతర జిల్లాల్లోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొట్టాయి. సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి పిట్లం, మేడ్చల్-మల్కాజిగిరి మల్కాజిగిరిలో 5.1 సెం.మీ చొప్పున వర్షం కురిసింది. మెదక్ నర్సాపూర్‌లో 4.7 సెం.మీ, పెద్దపల్లి శ్రీరాంపూర్, ముత్తారంలో 4.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోనూ నేడు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొత్తంగా అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరోసారి వానల జోరు పెరగనుండటంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!