ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeతెలంగాణనల్ల టీషర్ట్‌.. బనియన్‌తో నిరసన.. హరీశ్ రావు అరెస్ట్

నల్ల టీషర్ట్‌.. బనియన్‌తో నిరసన.. హరీశ్ రావు అరెస్ట్

📰 Generate e-Paper Clip

నల్ల టీషర్ట్‌.. బనియన్‌తో నిరసన.. హరీశ్ రావు అరెస్ట్

కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన

నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్‌ డిమాండ్‌

7 డీఏలు పెండింగ్‌లో ఉన్నా ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపణ

 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్ట్‌లు ధరించి అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాలకు హాజరయ్యారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు.ఈ క్రమంలో అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. నల్ల టీషర్ట్‌ ధరించి అసెంబ్లీలోకి రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. దీంతో హరీశ్‌ రావు టీషర్ట్‌ను విప్పి బనియన్‌తోనే నిరసన వ్యక్తం చేశారు. మరో నేత అనిల్‌ జాదవ్‌ కూడా ఆయనతో కలిసి బనియన్‌తో నిరసన తెలిపారు..బనియన్‌తోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు హరీశ్‌ రావు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అసెంబ్లీ ప్రధాన గేటు వద్దే ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.మరోవైపు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేవలం తూతూమంత్రంగా సమావేశాలు నిర్వహించడం కాకుండా కనీసం నెల రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరపాలని డిమాండ్‌ చేశారు. అన్ని అంశాలపై చర్చ జరిగేలా స్పీకర్‌ చొరవ తీసుకోవాలని కోరారు.రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన ఏడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమబాట పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందక ఇబ్బందులు పడుతున్న రిటైర్డ్‌ ఉద్యోగుల తరఫున కూడా అసెంబ్లీలో గొంతు విప్పుతామని తెలిపారు.అదేవిధంగా 22A పేరుతో జరుగుతున్న కుంభకోణంపై కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజలు, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై నిరసనగా నల్ల దుస్తులతో బీఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళనతో అసెంబ్లీ సమావేశాలు రాజకీయ వేడిని సంతరించుకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!