ePaper
Thursday, October 15, 2026
ePaper
Homeతెలంగాణపదవి కొంచెం... కబ్జా ఘనం...

పదవి కొంచెం… కబ్జా ఘనం…

📰 Generate e-Paper Clip

  • ములుగులో భూ మాఫియా చక్రబంధం..
  • కలెక్టరేట్‌లో అటెండర్ రూపంలో భూబకాసురుడు!
  • 15 రోజుల క్రితమే తెరవెనుక మారిన కోట్ల విలువైన ప్రభుత్వ భూమి
  • పక్కా ప్రణాళికలతో భూమాయ..
  • కబ్జా బయటపడకుండా చకచక చక్రం తిప్పడంలో దిట్ట
  • బీఆరఎస్ ఆఫీస్ వెనుక భూమి ఇప్పటికే ఆరు చేతులు మారింది..
  • అటెండర్ చేతిలో జిల్లా పాలనా ప్రాంగణం?
  • జిల్లా వ్యాప్తంగా బినామీ సామ్రాజ్యం
  • ఇంత టాలెండెట్‌గా ఉన్నావేంది భయ్యా…

 

అటెండర్ కుర్చీలో కూర్చుని అధికారపు నీడను పెంచుకుంటే… కలెక్టరేట్ గోడల మధ్య అధికారులే కనిపించని దుస్థితి! పెద్దాఫీసర్ల కింద పనులు చేసే చేతులు భూములను కూడా కదిలిస్తే… ప్రజల హక్కులు ఎక్కడికి పోవాలి? కంచె కాయాల్సిన చేతులే కంచెను దాటి లోపలికొచ్చాయి… కాపాడాల్సిన కుర్చీలే కబ్జాదారుల గూటికి మెట్లయ్యాయి!

ములుగు, పీపుల్స్ డైరీ : ములుగు జిల్లా కేంద్రంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం కలకలం రేపుతోంది. బీఆరఎస్ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కలెక్టరేట్ కిందిస్థాయి ఉద్యోగి, విషయం బయటకు వస్తుందనే భయంతో 15 రోజుల క్రితమే చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.
తన కూతురు పేరు మీద ఉన్న రిజిస్ట్రేషన్‌ను సడెన్‌గా బినామీల పేరు మీదకు మార్చేశాడు. ఈ భూమి ఇప్పటివరకు ఏకంగా ఆరుగురి చేతులు మారినట్లు స్పష్టమైన ఆధారాలు లభిస్తున్నాయి. లింకు డాక్యుమెంట్లు సృష్టించి చట్టానికి దొరకకుండా పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

కలెక్టరేట్‌ను శాసిస్తున్న అటెండర్…. నిబంధనల ప్రకారం పోస్టింగ్ ఒకచోట ఉంటే, ఈయన తిష్ట వేసింది మాత్రం ములుగు కలెక్టర్ ఆఫీసులో. ఉద్యోగం వచ్చినప్పటి నుండి ఒక్కరోజు కూడా అటెండర్ డ్రెస్ వేయలేదు. చేసేదంతా ఆఫీసర్ పెత్తనమే. కలెక్టరేట్‌లోనే ఉంటూ ఫైళ్లను శాసిస్తున్న తీరుపై ఉద్యోగ వర్గాల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
జిల్లా వ్యాప్తంగా బినామీ సామ్రాజ్యం….
ఇది ఒక్క భూమి వ్యవహారం మాత్రమే కాదు. జిల్లా నలుమూలలా ఎక్కడ ప్రభుత్వ భూమి ఖాళీగా కనిపిస్తే అక్కడ ఈయన హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. తన పేరు మీద, తన బినామీల పేరు మీద వందల ఎకరాల ప్రభుత్వ భూములను మార్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
రియల్ ఎస్టేట్ ముఠాతో లోపాయికారీ ఒప్పందం….
కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వ భూముల సమాచారాన్ని వారికి అందిస్తూ, అధికారికంగా వారికి అనుకూలంగా పనులు చేసిపెడుతూ, ఆ భూముల్లో కోట్ల రూపాయల వాటా తీసుకుంటున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వంలో ఉంటూనే ప్రభుత్వాన్నే మోసం చేస్తున్న ఈ భూ బకాసురుడిపై జిల్లా కలెక్టర్ ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!