ప్రభుత్వ ఆసుపత్రి ఛాంబర్‌లో కూతురి శ్రీమంతం వేడుక!
మధిర:
ఖమ్మం జిల్లా మధిర ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఒక వివాదాస్పద ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆసుపత్రిలోని నర్సింగ్ సూపరింటెండెంట్ తన అధికారిక ఛాంబర్‌ను ఏకంగా సొంత ఇంటిలా మార్చేసి, నియమ నిబంధనలను తుంగలో తొక్కారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నమ్మదగిన సమాచారం ప్రకారం.. సదరు అధికారిణి విధి నిర్వహణ సమయంలోనే (డ్యూటీ అవర్స్‌లో) తన కుమార్తె, అల్లుడికి ఆసుపత్రి లోపల వైభవంగా శ్రీమంతం వేడుకను నిర్వహించారు. ఈ ప్రైవేట్ కార్యక్రమానికి ఆసుపత్రిలో పనిచేసే పలువురు సిబ్బంది కూడా హాజరై, విధులను పక్కనబెట్టి వేడుకల్లో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ కార్యాలయాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకోవడం, రోగులకు వైద్య సేవలు అందించాల్సిన సమయంలో సిబ్బంది ఇలాంటి వేడుకల్లో పాల్గొనడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.అత్యవసర వైద్యం కోసం వచ్చే నిరుపేద రోగులకు ఈ వేడుకల వల్ల తీవ్ర అంతరాయం కలిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నత హోదాలో ఉన్న అధికారే ఇలాంటి బాధ్యతారాహిత్యానికి ఒడిగడితే, క్రింది స్థాయి సిబ్బందికి ఎలాంటి సందేశం వెళ్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సమగ్ర విచారణ జరపాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

