– శ్రీ నేతాజీ హైస్కూల్ లో మాక్ అసెంబ్లీ
– సభాపతిగా.. మంత్రులుగా.. ఎమ్మెల్యేలుగా విద్యార్థుల పాత్రలు
– ప్రజా సమస్యలపై సీరియస్ గా చర్చ
– ప్రశ్నోత్తరాలతో అదరగొట్టిన విద్యార్థులు
– ప్రభుత్వ పథకాలపై ఆసక్తికర చర్చ
– ప్రజాస్వామ్య విలువలపై అవగాహన
– నాయకత్వ లక్షణాలకు మాక్ అసెంబ్లీ వేదిక
– సమస్యలను విశ్లేషించే సామర్థ్యానికి పదును
– సభలో మాట్లాడే నైపుణ్యాలపై శిక్షణ
– బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి
– బస్వరాజుపల్లిలో ఆకట్టుకున్న కార్యక్రమం
– కరస్పాండెంట్ ఉడుత సాంబయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహణ
– అసెంబ్లీ సమావేశాల తీరును ప్రత్యక్షంగా ప్రదర్శన
– విద్యార్థుల ప్రదర్శనకు ఉపాధ్యాయుల ప్రశంసలు
– ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యం
గణపురం, ఆగస్టు 22 (పీపుల్స్ డైరీ):
విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమం ఆకట్టుకుంది. గణపురం మండలంలోని బస్వరాజుపల్లి గ్రామంలోని శ్రీ నేతాజీ హైస్కూల్లో శనివారం పాఠశాల కరస్పాండెంట్ ఉడుత సాంబయ్య యాదవ్ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీని నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అసెంబ్లీ సమావేశాల తీరును కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.
– అసెంబ్లీని తలపించిన పాఠశాల
మాక్ అసెంబ్లీలో విద్యార్థులు ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్ తదితర పాత్రలను స్వీకరించారు. సభ ప్రారంభం నుంచి ప్రశ్నోత్తరాల సమయం వరకు శాసనసభలో జరిగే కార్యక్రమాలను అనుకరిస్తూ ప్రదర్శనలు ఇచ్చారు. స్పీకర్ స్థానంలో ఉన్న విద్యార్థి సభను నిర్వహించగా, ఇతర విద్యార్థులు ప్రజాప్రతినిధులుగా వ్యవహరించారు. దీంతో పాఠశాల ఆవరణ కొద్దిసేపు అసెంబ్లీని తలపించింది. ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యార్థులకు సంబంధించిన అంశాలను మాక్ అసెంబ్లీ వేదికగా విద్యార్థులు చర్చించారు. ఆయా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధానం, సంబంధిత మంత్రులు సమాధానాలు ఇవ్వడం, సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించడం వంటి అంశాలను విద్యార్థులు ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలు, ఇచ్చిన సమాధానాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
– నాయకత్వ లక్షణాలకు దోహదం
మాక్ అసెంబ్లీ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, మాట్లాడే నైపుణ్యం, సమయస్ఫూర్తి, సమస్యలను విశ్లేషించే సామర్థ్యం పెంపొందుతాయని పాఠశాల కరస్పాండెంట్ ఉడుత సాంబయ్య యాదవ్ తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ పాత్ర, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లే విధానంపై విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన కలుగుతుందన్నారు. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమాజం, ప్రజాస్వామ్యం, పాలనా వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు భవిష్యత్లో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుందని తెలిపారు.
