*బ్రేకింగ్ మోజు… పెద్దింటి శోకం!*
*ముందు చెప్పడం కాదు… సరిగ్గా చెప్పడమే జర్నలిజం!*
*సోషల్ మీడియా వార్తలే ఆధారమా? పాత్రికేయానికేం పట్టింది గతి!*
*నిర్ధారణ లేని వార్తలు: సమాజానికి, మీడియాకు ముప్పు*
*వ్యూస్ కావాలి… ప్రాణం ఉన్నా చంపేస్తారు!*
వేగమే లక్ష్యంగా మారిన డిజిటల్ యుగంలో కొన్ని మీడియా సంస్థలు ధృవీకరణ కంటే “మొదట వార్త ఇవ్వాలి” అనే పోటీకే ప్రాధాన్యం ఇస్తుండడం మరోసారి చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురైన ఘటనలో వైద్యుల అధికారిక ప్రకటనకు ముందే మరణించినట్లు ప్రసారం చేయడం బాధ్యతాయుతమైన జర్నలిజంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రాణాపాయ స్థితిలో చికిత్స కొనసాగుతున్న సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులను, అనధికార సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుకు గురైన తర్వాత వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించారు. డాక్టర్ మమతా రెడ్డి నేతృత్వంలోని బృందం పలుమార్లు సీపీఆర్ నిర్వహించి గుండె స్పందనను పునరుద్ధరించి, అనంతరం లైఫ్ సపోర్ట్‌పై ఉంచి హైదరాబాద్‌కు తరలించింది. వైద్యులు ప్రాణాల కోసం పోరాడుతున్న సమయంలోనే కొన్ని మీడియా వేదికల్లో ఆయన మరణించినట్లు వార్తలు ప్రసారం కావడం కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది.
సోషల్ మీడియా పోస్టే ఆధారమా?
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా పోస్టులు, వాట్సాప్ సందేశాలనే ప్రాథమిక ఆధారాలుగా తీసుకుని వార్తలు ప్రసారం చేసే ధోరణి పెరుగుతోందని సీనియర్ పాత్రికేయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకరు పెట్టిన పోస్టును మరొకరు ధృవీకరణ లేకుండానే ప్రచారం చేయడం, అధికారిక సమాచారం కోసం వేచి చూడకపోవడం జర్నలిజం మూల సూత్రాలకు విరుద్ధమని చెబుతున్నారు. ముఖ్యంగా ఒక వ్యక్తి ప్రాణాలకు సంబంధించిన వార్తల్లో వైద్యుల బులెటిన్ లేదా కుటుంబ సభ్యుల అధికారిక ప్రకటన వచ్చే వరకు సంయమనం పాటించడం మీడియా నైతిక బాధ్యతగా పేర్కొంటున్నారు. వార్త ముందుగా ఇవ్వాలనే పోటీ సహజమే అయినప్పటికీ, అది నిజానిజాలను పక్కనపెట్టి ఉండకూడదని మీడియా విశ్లేషకులు సూచిస్తున్నారు. ఒక తప్పు వార్త కేవలం ప్రేక్షకులను, పాఠకులను తప్పుదోవ పట్టించడమే కాదు, ఆ కుటుంబాన్ని మానసికంగా తీవ్ర వేదనకు గురిచేస్తుందని గుర్తుచేస్తున్నారు. వేగం కంటే విశ్వసనీయతే జర్నలిజం బలం అని, సోషల్ మీడియా ప్రచారాన్ని కాదు.. ధృవీకరించిన సమాచారాన్నే వార్తగా అందించడం మీడియా విశ్వసనీయతను నిలబెడుతుందని అభిప్రాయపడుతున్నారు.
