- మహిళ మెడలో బంగారు పుస్తెలతాడు అపహరణ
ఏన్కూరు, ఆగస్టు 2:
ఇంట్లో నిద్రిస్తున్న ఒక మహిళ మెడ నుంచి గుర్తుతెలియని వ్యక్తి బంగారు పుస్తెలతాడును చోరీ చేసిన ఘటన ఏన్కూరు మండల పరిధిలోని శ్రీరాంపురం తండాలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో ఒక గుర్తుతెలియని దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు. నిద్రపోతున్న మహిళ మెడలోని రెండు మడతల బంగారు పుస్తెలతాడును కట్ చేసి, దానికి ఉన్న రెండు బంగారు పుస్తెలతో సహా దొంగిలించి పారిపోయాడు.ఆలస్యంగా మెలకువ వచ్చిన బాధితురాలు అలజడి విని వెంటనే తన భర్తకు విషయం తెలిపింది. స్థానిక గ్రామస్థుల సాయంతో పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ నిందితుడి ఆచూకీ లభించలేదు. దొంగిలించబడిన బంగారు పుస్తెలతాడు, పుస్తెలు కలిపి సుమారు 3 తులాల 2 గ్రాములు (బంగారం) ఉంటుందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏన్కూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నారబోయిన సంధ్య తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, సాంకేతిక ఆధారాలు మరియు సాక్ష్యాలను సేకరిస్తున్నారు. నిందితుడిని త్వరలోనే గుర్తించి అరెస్టు చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. రాత్రి సమయాల్లో ప్రజలు ఇళ్ల తలుపులు తప్పనిసరిగా వేసుకోవాలని, విలువైన బంగారు ఆభరణాలను భద్రపరుచుకోవాలని కోరారు. పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ విజ్ఞప్తి చేశారు.
