ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeతెలంగాణపెద్దాసుపత్రి... పేదలకు భారోసానా...! శాపమా...?

పెద్దాసుపత్రి… పేదలకు భారోసానా…! శాపమా…?

📰 Generate e-Paper Clip

పెద్దాసుపత్రి… పేదలకు భారోసానా…! శాపమా…?

  • ఎంఆర్ఐ ప్రారంభం.. సేవలు మాత్రం శూన్యం!
    – తాగునీరు లేదు.. వైద్యులు లేరు.. ఇదేనా జిల్లా ఆసుపత్రి…?
    – మరుగుదొడ్లు అధ్వాన్నం.. వైద్య సేవలపై తీవ్ర అసంతృప్తి
    – పరికరాలు ఉన్నా సేవలు అందని దుస్థితి
    – ఆదివారాల్లో పూర్తి వైద్య సేవలు ఎక్కడ?
    – రాజకీయాల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం..
    – జిల్లా ఆస్పత్రిని వెంటనే బలోపేతం చేయాలి
    – జిల్లా ఆస్పత్రి వైద్య సేవలా… రిఫరల్ సేవలా?
    – ఆక్సిజన్ ప్లాంట్ సమస్య పరిష్కరించాలన్న డిమాండ్
    – జిల్లా జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి

పీపుల్స్ డైరీ, భూపాలపల్లి:

జిల్లాలో లక్షలాది మంది పేదలకు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నేడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఆరోపించారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, దినపత్రికల్లో వరుసగా వెలువడుతున్న కథనాల నేపథ్యంలో ఆదివారం ఆయన ఆకస్మికంగా జిల్లా ఆస్పత్రిని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి నిర్వహణ, వైద్య సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. జిల్లా ఆస్పత్రిలో తాగునీటి కొరత, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు, రోగులకు కనీస సౌకర్యాల లేమి, వైద్యులు, సిబ్బంది కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. ఉన్న రోగం తగ్గించుకోవడానికి వచ్చే రోగులకు ఆస్పత్రి పరిస్థితుల వల్ల కొత్త సమస్యలు ఎదురయ్యే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రారంభించిన ఎంఆర్ఐ స్కానింగ్ సేవలు ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. యంత్రాన్ని ప్రారంభించి నెల రోజులు దాటినా సంబంధిత వైద్య నిపుణులను నియమించకపోవడంతో సేవలు ప్రారంభం కాలేదని విమర్శించారు. మరోవైపు ఆక్సిజన్ ప్లాంట్ సమస్యను వెంటనే పరిష్కరించాలని, అత్యవసర వైద్య సేవలు ఎలాంటి ఆటంకం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలకే రోగులను ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారనే ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని పేర్కొంటూ, “ఇది జిల్లా జనరల్ ఆస్పత్రా… లేక రిఫరల్ సెంటరా?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం రోజున పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులో లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో వచ్చే పేద ప్రజల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఐదు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో రోగులు, వారి సహాయకులు బయట నుంచి నీటి సీసాలు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఆస్పత్రి ఆవరణలో నిరుపయోగంగా పడివున్న ట్రాన్స్‌ఫార్మర్, అపరిశుభ్రంగా మారిన మరుగుదొడ్లు, తాళాలు వేసి ఉన్న టాయిలెట్లు, ఆస్పత్రి ప్రాంగణంలో అనుచిత వస్తువులు కనిపించడం నిర్వహణలో ఉన్న లోపాలను బహిర్గతం చేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో కలిసి జిల్లా ఆస్పత్రిపై తరచూ సమీక్షలు నిర్వహించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించామని, కరోనా సమయంలో వేలాది మంది ప్రాణాలను కాపాడిన ఆస్పత్రి నేడు సమస్యలతో కుంగిపోవడం బాధాకరమన్నారు. జిల్లా ఆస్పత్రిలో సమస్యలు వరుసగా వెలుగులోకి వస్తున్నప్పటికీ ప్రభుత్వం, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని విమర్శించారు. జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు వెంటనే పరిస్థితులను సమీక్షించాలని, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్వయంగా ఆస్పత్రిని సందర్శించి తాగునీరు, పరిశుభ్రత, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, మందులు, వైద్య పరికరాల కొరతను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. “రాజకీయాలు తర్వాత… ప్రజల ప్రాణాలే ముందు. జిల్లా జనరల్ ఆస్పత్రిని వెంటనే బలోపేతం చేసి పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నిర్లక్ష్యానికి ఇక ముగింపు పలకాలి” అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!