ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeతెలంగాణతల్లిపాలే శిశువుకు తొలి టీకా.. జీవితాంతం ఆరోగ్యానికి పునాది.

తల్లిపాలే శిశువుకు తొలి టీకా.. జీవితాంతం ఆరోగ్యానికి పునాది.

📰 Generate e-Paper Clip

https://peoplesdairynews.com/wp-content/uploads/2026/08/IMG-20260805-WA0014.jpg

*తల్లిపాలే శిశువుకు తొలి టీకా.. జీవితాంతం ఆరోగ్యానికి పునాది*

*ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో మెడిసిటీ–అల్వాల్ పీహెచ్‌సీ సంయుక్త అవగాహన కార్యక్రమం*

*తల్లిపాలపై అపోహలను వీడి ప్రతి తల్లి బిడ్డకు స్వయంగా పాలివ్వాలి: వైద్య నిపుణులు*

మేడ్చల్, ఆగస్టు 5(పీపుల్స్ డైరీ):- శిశువుకు జన్మనిచ్చిన ప్రతి తల్లి అందించే తొలి బహుమతి తల్లిపాలేనని, అవే బిడ్డకు సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించే తొలి టీకా అని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల (ఆగస్టు 1–7) సందర్భంగా మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో కలిసి పిల్లల తల్లులు, గర్భిణుల కోసం నిర్వహించిన అవగాహన సదస్సులో వారు ఈ విషయాలను వివరించారు. వైద్యుల ప్రకారం, తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు వైరస్‌లు, బ్యాక్టీరియాల నుంచి రక్షణ కల్పిస్తాయి. పుట్టిన వెంటనే వచ్చే పసుపు రంగు ముర్రుపాలు (కొలస్ట్రం) శిశువుకు అత్యంత విలువైనవని, వాటిని వృథా చేయకుండా తప్పనిసరిగా పట్టించాలని సూచించారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువు ఎదుగుదలతో పాటు తల్లి ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని తెలిపారు.
మెడిసిటీ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డా. గీత మాట్లాడుతూ, తల్లిపాలు బిడ్డకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఆహారమని, తల్లి–బిడ్డల మధ్య భావోద్వేగ అనుబంధాన్ని మరింత బలపరుస్తాయని అన్నారు. పీడియాట్రిక్ విభాగాధిపతి డా. సుదర్శన్ మాట్లాడుతూ, తల్లిపాలు కేవలం ఆహారం మాత్రమే కాకుండా ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బలమైన పునాదిని వేస్తాయని పేర్కొన్నారు. అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా. శ్రీకాంత్ మాట్లాడుతూ, డబ్బా పాలు లేదా ఇతర పాలు తల్లిపాలకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మెడిసిటీ వైద్య కళాశాల పీజీ విద్యార్థులు ప్రదర్శించిన అవగాహన నాటిక విశేషంగా ఆకట్టుకుంది. తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగిస్తూ, శిశువుకు సరైన పద్ధతిలో పాలివ్వడం, పాటించాల్సిన జాగ్రత్తలను సులభంగా వివరించారు. కార్యక్రమానికి హాజరైన తల్లులు, గర్భిణులు తమకు ఎంతో ఉపయోగకరమైన సమాచారం అందిందని, తల్లిపాల ప్రాధాన్యతపై స్పష్టమైన అవగాహన కలిగిందని తెలిపారు. సదస్సు అనంతరం గర్భిణులు, బాలింతలకు పండ్లతో పాటు పోషకాహారంగా వేరుశనగ చిక్కీలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డా. ఈనాక్షి గంగూలీ, డా. సమీర్, డా. నాగరాజు, వైద్యులు, పీజీ విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, బాలింతలు, గర్భిణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!