ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్మేడిపల్లిలో భర్తను హత్య చేసినా భార్య.

మేడిపల్లిలో భర్తను హత్య చేసినా భార్య.

📰 Generate e-Paper Clip

మేడిపల్లిలో భర్తను హత్య చేసినా భార్య

రోడ్డు ప్రమాదంగా
చిత్రీకరించిన భార్య సునీత అరెస్ట్.

దర్యాప్తులో వెలుగుచూసిన సంచలన నిజాలు.

భర్త హత్య కేసును ఛేదించిన
మేడిపల్లి పోలీసులు..

బోడుప్పల్,పీపుల్స్ డైరీ: భర్త హత్య కేసును మేడిపల్లి పోలీసులు ఛేదించారు.భర్తను కర్రతో కొట్టి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం..ఆగస్టు 6న మృతుడు సత్యనారాయణ (51) నైట్ డ్యూటీ ముగించుకుని మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు.అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో అతని భార్య సునీత (44) రోజువారీ పనులు ముగించుకుని ఇంటికి వచ్చింది.మృతుడు మద్యం సేవించడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో సత్యనారాయణ తన భార్యను దూషిస్తూ మానసికంగా వేధించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు.
భర్త ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన సునీత అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం మృతుడి చేతులు, కాళ్లను చీరతో కట్టి,సెంట్రింగ్ కర్రతో తలపై,శరీరంలోని ఇతర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు వెల్లడించారు.తీవ్ర గాయాల కారణంగా సత్యనారాయణ స్పృహ కోల్పోయాడు.
అనంతరం తన కుమారుడు నికిత్‌కు ఫోన్ చేసిన నిందితురాలు.. తన తండ్రి వాహనం నుంచి ప్రమాదవశాత్తు జారిపడి గాయపడ్డాడని తప్పుడు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.గాయపడిన సత్యనారాయణను బోడుప్పల్‌లోని మెడిస్టార్ ఆసుపత్రికి తరలించగా,వైద్యుల సూచన మేరకు గాంధీ ఆసుపత్రికి తరలించారు.అక్కడ రాత్రి 10.18 గంటలకు వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
అయితే ఘటనపై అనుమానాలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం,వైద్యుల అభిప్రాయం,సంఘటనా స్థల పరిశీలనతో పాటు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. ప్రమాదం జరిగినట్లు ఆధారాలు లభించకపోవడంతో నిందితురాలిని విచారించగా,భర్త తనను,పిల్లలను మానసికంగా వేధిస్తున్నాడని,ఆ కారణంతోనే అతడిపై దాడి చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితురాలు చూపించిన ప్రదేశం నుంచి మృతుడి చేతులు,కాళ్లు కట్టేందుకు ఉపయోగించిన చీరతో పాటు దాడికి ఉపయోగించిన సెంట్రింగ్ కర్రను పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.
సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా హత్యలో నిందితురాలి ప్రమేయం నిర్ధారణ కావడంతో హత్య కేసుగా మార్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!