ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeతెలంగాణపాత వీడియోతో కొత్త డ్రామా..!

పాత వీడియోతో కొత్త డ్రామా..!

📰 Generate e-Paper Clip

– ఎడిట్‌ చేసి నిన్నటి ఘటనగా చిత్రీకరణ
– రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
– మార్చి 10న జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో అంటూ వెల్లడి
– వీడియోలో కొంత భాగాన్ని మాత్రమే సోషల్‌ మీడియాలో పెట్టారని ఆరోపణ
– ఘటనపై అప్పుడే ఎఫ్‌ఐఆర్‌.. ప్రస్తుతం కోర్టు పరిధిలో కేసు
– ‘రాజకీయ విమర్శలు చేయండి.. వ్యక్తిగత దుష్ప్రచారం వద్దు’
– ‘పాత ఘటనలను కొత్తవిగా చూపిస్తే ఇక ఊరుకోం’
– ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపణ
– ‘వాస్తవాలు ప్రజలకు తెలుసు.. సోషల్‌ మీడియాతో తప్పుదోవ పట్టించలేరు’
– కాంగ్రెస్‌ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా
– మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పోలుసాని లక్ష్మీనరసింహా రావు

భూపాలపల్లి, ఆగస్టు 18 (పీపుల్స్ డైరీ):

పాత వీడియోను ఎడిట్‌ చేసి, అది నిన్న జరిగిన ఘటనగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పోలుసాని లక్ష్మీనరసింహారావు ఆరోపించారు. వాస్తవాలను వక్రీకరిస్తూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో బుధవారం నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌కు చెందిన ఐఎన్‌సీ భూపాలపల్లి (INC_Bhupalapally) ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తనకు సంబంధించిన పాత వీడియోను ఎడిట్‌ చేసి, నిన్నటి ఘటనగా ప్రచారం చేశారని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.

– మార్చి 10న ఘటన

మార్చి 10న యూనివర్సిటీ క్రాస్‌ సమీపంలో ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి తన కారును ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారని లక్ష్మీనరసింహా రావు తెలిపారు. వారిని అడ్డుకునే క్రమంలో జరిగిన వివాదానికి సంబంధించిన కొంత భాగాన్ని మాత్రమే వీడియోగా తీసుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై అప్పట్లోనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని, ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉందని తెలిపారు.

– ‘రమణారెడ్డి అనుచరుడినే’

తాను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరుడిననే విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నానని అన్నారు. రాజకీయ జీవితంలో మొదటి నుంచీ ఆయనతోనే కొనసాగుతున్నానని తెలిపారు. పేదలు, ప్రజలకు సేవ చేయడం, రాజకీయాల్లో నిబద్ధతతో ఉండటం వంటి విలువలను ఆయన నుంచి నేర్చుకున్నామని పేర్కొన్నారు. తమ నాయకుడి పేరును ప్రస్తావిస్తూ తప్పుడు ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని అన్నారు.

– ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులా…?

గణపురం ప్రాంతంలోని వంతెన నిర్మాణం, చెరువుకు నీటి విడుదల వంటి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ప్రజల తరఫున ప్రశ్నించినందుకు తమపై, నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టడం, ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. ప్రజా ఒత్తిడి, తమ పోరాటం తర్వాతే సంబంధిత సమస్యలపై ప్రభుత్వం స్పందించిందని పేర్కొన్నారు.

– ‘ఇక మౌనంగా ఉండం’

పాత ఘటనలను కొత్తవిగా చూపిస్తూ వీడియోలను ఎడిట్‌ చేసి ప్రచారం చేయడం మానుకోవాలని లక్ష్మీనరసింహారావు హెచ్చరించారు. తనపై, తమ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారం కొనసాగితే ఇకపై మౌనంగా ఉండబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నామని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ విమర్శలు ప్రజాస్వామ్యంలో సహజమేనని, అయితే వ్యక్తిగతంగా కించపరిచేలా తప్పుడు వీడియోలను ప్రచారం చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో గణపురం, భూపాలపల్లి నాయకులు, పట్టణ మాజీ అధ్యక్షులు కటకం జనార్దన్, మాజీ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్‌రెడ్డి, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రా రెడ్డి, జిల్లా నాయకులు సెగ్గెం సిద్దూ, మాడ హరీష్ రెడ్డి పిన్నింటి శ్రీనివాస్‌ రావు, సింగణవేణి చిరంజీవి, మాజీ కౌన్సిలర్ మురళీ, హఫీజ్, గాజర్ల చింటూ గౌడ్, మామిండ్ల సాంబయ్య, పిన్నింటి మణిదీప్‌ రావు, మహేందర్, పబ్బ రవీందర్, మార్క సాయిగౌడ్, వాజీత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!