– చిత్రకళలో అదరగొడుతున్న ఐదో తరగతి విద్యార్థిని ఆద్య
– ఎల్కేజీ నుంచే బొమ్మలపై ఆసక్తి.. ఇప్పుడు అద్భుత చిత్రాలు
– ఊహలకు సృజన జోడించి చక్కటి చిత్రాల రూపకల్పన
– స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గీసిన చిత్రానికి గుర్తింపు
– ఇండియన్ ఆర్ట్ కాంటెస్ట్‌లో సర్టిఫికెట్, మెడల్
– రాఖీ పర్వదినం సందర్భంగా సొంతంగా రాఖీ తయారీ
– తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ముందడుగు
– చిన్న వయసులోనే కళారంగంలో ప్రత్యేక ప్రతిభ
పీపుల్స్ డైరీ, భూపాలపల్లి:
చిన్న వయసులోనే చిత్రకళపై ఆసక్తి పెంచుకొని తన కుంచెతో అద్భుత చిత్రాలు గీస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది భూపాలపల్లికి చెందిన చిన్నారి ఆద్య. మున్సిపాలిటీ పరిధిలోని ఎల్బీనగర్కు చెందిన ఆద్య జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఎల్కేజీ నుంచే బొమ్మలు గీయడంపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. ప్రస్తుతం వివిధ అంశాలపై చక్కటి చిత్రాలను రూపొందిస్తూ తన ప్రతిభను చాటుతోంది. చిన్నతనంలోనే కాగితాలపై గీతలు, బొమ్మలు గీస్తూ తన అభిరుచిని పెంచుకున్న ఆద్యకు తల్లిదండ్రులు ప్రోత్సాహం అందిస్తున్నారు. దీంతో తన ఊహాశక్తికి సృజనాత్మకతను జోడిస్తూ విభిన్నమైన చిత్రాలను గీయడం అలవాటుగా మార్చుకుంది. ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె గీసిన చిత్రంలో అన్ని మతాలకు సంబంధించిన చిహ్నాలను పొందుపరిచి మతసామరస్యం, ఐక్యతను చాటింది. ఆద్య ప్రతిభను గుర్తించిన ఇండియన్ ఆర్ట్ కాంటెస్ట్ నిర్వాహకులు సర్టిఫికెట్తో పాటు మెడల్‌ను అందజేశారు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంటి వద్ద ఉన్న ఆద్య తన సృజనాత్మకతకు పదును పెట్టి స్వయంగా రాఖీని కూడా తయారు చేసింది. చిత్రకళతో పాటు చేతిపనులపై కూడా ఆసక్తి చూపుతున్న ఆద్య.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకుంటోంది. చిన్న వయసులోనే కళారంగంలో ప్రతిభ కనబరుస్తున్న ఆద్యను కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. భవిష్యత్తులో చిత్రకళలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు.

