- వ్యర్థాల దహనంపై శాటిలైట్ నిఘా
- వ్యవసాయంలో కొత్త ప్రమాద ఘంటిక
ఇప్పటివరకు ఉత్తర భారతదేశానికి, ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రానికే పరిమితమైందని భావించిన పంట వ్యర్థాల దహనం సమస్య ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్నీ వేధిస్తోంది. వరి, మక్కజొన్న పంటల కోత అనంతరం మిగిలిపోయే ఎండు గడ్డిని రైతులు తగులబెట్టడం వల్ల పర్యావరణానికి నష్టం కలగడమే కాకుండా ప్రాణ నష్టాలు కూడా సంభవిస్తున్నాయి. ఇటీవలి కాలంలో పలు జిల్లాల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో రైతులు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ శాఖ అధికారుల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల కొరత, పశువుల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాలతో రైతులు పొలాలను త్వరగా శుభ్రం చేసుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గతంలో పంట వ్యర్థాలను పశువుల మేతగా వినియోగించేవారు. అయితే ఇప్పుడు ఆ అవసరం తగ్గిపోవడంతో రైతులు వాటిని తగులబెట్టడం సులభమైన పరిష్కారంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ ఘటనలు తీవ్రరూపం దాల్చాయి. ఖమ్మం జిల్లా పాథర్లపాడులో రైతులు పెట్టిన మంటలు పక్కనే ఉన్న పంట పొలాలకు వ్యాపించి వందల క్వింటాళ్ల దిగుబడి బూడిదయ్యింది. ఈ ప్రమాదాలు రైతుల కుటుంబాల్లో విషాదాన్ని మిగులుస్తున్నాయి. మే 24న భూపాలపల్లి జిల్లాలో చంద్రమౌళి అనే రైతు పంట వ్యర్థాలను తగులబెడుతూ మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. ఆ ఘటనను చూసిన ఆయన భార్య భాగ్యమ్మ తీవ్ర ఆవేదనతో అక్కడికక్కడే కన్నుమూసింది. అలాగే మే 13న నిర్మల్ జిల్లాలో మంద గంగన్న అనే రైతు మక్కజొన్న వ్యర్థాలకు నిప్పు పెట్టగా మంటలు వరి పొలాలకు వ్యాపించాయి. వాటిని ఆర్పే ప్రయత్నంలో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయాడు. మే 10న హనుమకొండ జిల్లాలో జి. జయపాల్ రెడ్డి అనే వృద్ధ రైతు ప్రమాదవశాత్తు మంటల్లో పడిపోయి మరణించాడు. ఈ ఘటనల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట వ్యర్థాల దహనం వల్ల గాలి నాణ్యత దెబ్బతినడమే కాకుండా భూసారం కూడా తగ్గిపోతుందని ఆయన హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇకపై పొలాల్లో మంటలు పెట్టే రైతులను గుర్తించేందుకు ప్రభుత్వం శాటిలైట్ ఇమేజరీ వినియోగించనుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలు, ఎయిర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయనున్నారు. అవసరమైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదే విధంగా పర్యావరణ పరిహారం పేరుతో జరిమానాలు కూడా విధించనున్నారు. 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రూ.2500, 2 నుంచి 5 ఎకరాల మధ్య భూమి ఉన్నవారికి రూ.5000, 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు రూ.15 వేల వరకు జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ సమస్య మరింత తీవ్రమవకుండా ఉండేందుకు గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతులు కూడా పంట వ్యర్థాల దహనం వల్ల కలిగే ప్రమాదాలను గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.
