భవనం పై నుంచి పడి సెంట్రింగ్ కార్మికుడు మృతి
మేడ్చల్, జూన్ 4(పీపుల్స్ డైరీ):- మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవోదయ వెంచర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో సెంట్రింగ్ పనులు నిర్వహిస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు పై అంతస్తు నుంచి కిందపడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు, భవనం మూడో అంతస్తులో సెంట్రింగ్ పనులు చేస్తుండగా కార్మికుడు అదుపుతప్పి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవర రవిగా గుర్తించారు. అతను హైదరాబాద్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

