ePaper
Saturday, July 11, 2026
ePaper
Home Blog Page 8

పున్నమి వెలుగుల్లో పరవశించిన త్రివేణి సంగమం

0

పున్నమి వెలుగుల్లో పరవశించిన త్రివేణి సంగమం

– రాత్రివేళల్లో అపూర్వ దృశ్యంగా సంగమం

– విద్యుత్ వెలుగులతో కనులపండువగా ఘాట్లు

– కనులపండువగా విద్యుత్ అలంకరణలు…

– కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

– భక్తుల రద్దీకి తగ్గట్టుగా ట్రాఫిక్ నియంత్రణ

కాలేశ్వరం (భూపాలపల్లి), మే 29 (పీపుల్స్ డైరీ):

సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాలేశ్వరం త్రివేణి సంగమం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. ప్రభుత్వం, వివిధ శాఖల సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పవిత్ర స్నానాల కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో సంగమ ప్రాంతం భక్తిజన సందోహంతో నిండిపోయింది. త్రివేణి సంగమ పరిసరాలను ప్రత్యేక సెట్టింగ్స్‌తో శోభాయమానంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలు, ఆధ్యాత్మిక భావాన్ని ప్రతిబింబించే కళాత్మక నిర్మాణాలు, ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో వెలుగుల కాంతుల్లో త్రివేణి సంగమం మరింత అందంగా మెరిసిపోతూ దర్శనార్థులకు కనువిందు చేస్తోంది. పున్నమి చంద్రుడి వెలుగులో పవిత్ర సంగమ క్షేత్రం అపూర్వ సౌందర్యాన్ని సంతరించుకుంది. భక్తులు పవిత్ర జలాల్లో స్నానాలు ఆచరిస్తూ, ఆలయ దర్శనం చేసుకుంటూ ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోతున్నారు. “ఈసారి చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు” అంటూ పలువురు యాత్రికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక బృందాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. తాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య సదుపాయాలు, విశ్రాంతి కేంద్రాలు, మార్గదర్శక బోర్డులు వంటి అన్ని మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచారు. అదనంగా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తూ భక్తుల రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక బస్సులు, పార్కింగ్ సదుపాయాలు కల్పించడంతో యాత్రికులు సౌకర్యవంతంగా పుష్కర ఘాట్లకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా అధికారులు భక్తులు క్రమశిక్షణ పాటిస్తూ అధికారుల సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. సరస్వతి అంత్య పుష్కరాలు ఆధ్యాత్మిక వైభవంతో పాటు సాంస్కృతిక వైభవాన్నీ ప్రతిబింబిస్తూ భక్తులకు చిరస్మరణీయ అనుభూతిని అందిస్తున్నాయి.

కీసరలో హృదయవిదారకం: ధోబీఘాట్ వద్ద నవజాత శిశువు మృతదేహం లభ్యం

0

మేడ్చల్, మే 29 (మీడియా ప్రతినిధి):

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. నాగారం విజయపురి కాలనీ రోడ్ నెం.4లోని ధోబీఘాట్ ప్రాంతంలో గుర్తుతెలియని నవజాత మగ శిశువు మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

పోలీసుల కథనం ప్రకారం:

మే 28న మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో, స్థానికుడు తిరుమల శెట్టి సోమరాజు ఇచ్చిన డయల్-100 సమాచారం మేరకు పెట్రోల్ మొబైల్-2 ఇన్‌చార్జ్ పి.సి జంగయ్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ధోబీఘాట్ ప్రాంతంలో ఒక తెలుపు రంగు ప్లాస్టిక్ కవర్‌లో ఒకటి లేదా రెండు రోజుల వయస్సు గల నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లినట్లు గుర్తించారు.

అక్కడి నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు, అంబులెన్స్ సిబ్బందితో కలిసి శిశువును పరీక్షించగా.. అప్పటికే ఆ పసికందు మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు – దర్యాప్తు:

ఈ అమానుష ఘటనపై కీసర పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 497/2026 కింద, కొత్త చట్టం సెక్షన్ 93 బి.ఎన్.ఎస్ (BNS) ప్రకారం కేసు నమోదు చేశారు. ఎస్‌.ఐ. బి. నాగరాజు కేసు నమోదు చేయగా, ఎస్‌.ఐ. కె. శ్రీనివాస్ దర్యాప్తును చేపట్టారు. పసికందును అక్కడ వదిలివెళ్లిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను సేకరించి, దర్యాప్తును ముమ్మరం చేశారు.

“బోడి గుండుకు.. ఉపాధి హామీకి ముడి”..

ముఖ గుర్తింపు హాజరు విధానంతో ఉపాధి కూలీ ఇక్కట్లు

మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో జరిగిన ఓ వింత ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉపాధి హామీ పథకం (MGNREGS) పనుల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫేస్ రికగ్నిషన్’ మొబైల్ యాప్ ఓ కూలీ పాలిట శాపం అయింది. గ్రామానికి చెందిన మల్యాల శ్రీనివాస్ అనే కూలీ కొండగట్టు అంజన్న క్షేత్రానికి వెళ్లి తలనీలాలు సమర్పించుకుని గుండుతో తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఎప్పటిలాగే ఉపాధి హామీ పనికి వెళ్లగా, అక్కడి ఫీల్డ్ అసిస్టెంట్ డిజిటల్ హాజరు తీసుకోవడానికి యాప్‌ను ఆన్ చేశారు. అయితే, గతంలో జుట్టుతో ఉన్న శ్రీనివాస్ ముఖాన్ని, ఇప్పుడు గుండుతో ఉన్న అతడి ముఖాన్ని ఆ యాప్ మ్యాచ్ చేయలేకపోయింది. ఫీల్డ్ అసిస్టెంట్ ఎంత ప్రయత్నించినా, క్యాప్చర్ చేసిన ప్రతిసారీ యాప్ అతడిని గుర్తించకుండా రిజెక్ట్ అని చూపించింది.

తలపై జుట్టు లేకపోవడమే యాప్ గుర్తుపట్టకపోవడానికి ప్రధాన కారణమని గమనించిన తోటి ఉపాధి హామీ మహిళా కూలీ సమయస్ఫూర్తితో, తన జడను ముందుకు వేసి, శ్రీనివాస్ తలపై జుట్టు ఉన్నట్లుగా అమర్చింది. అలా జడను తలపై ఉంచి మళ్లీ ఫోన్ కెమెరా ముందు నిలబడగా, ఈసారి యాప్ తక్షణమే అతడి ముఖాన్ని గుర్తించి అటెండెన్స్ నమోదు చేసింది. సాంకేతికత ఎంత ఆధునికంగా మారినా, కొన్నిసార్లు ఇలాంటి వింత పరిస్థితులు ఎదురవుతుంటాయని ఈ ఘటన నిరూపించింది. జడ సహాయంతో హాజరు పడటంతో శ్రీనివాస్ ఊపిరి పీల్చుకోగా, ఆ సమయంలో అక్కడ ఉన్న కూలీలందరూ ఒక్కసారిగా నవ్వు ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ ‘జడ హాజరు’ ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మెట్రో తర్వాత మరో సంచలనం…

0
  • హైదరాబాద్​ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పు!
  • ఇక ఆకాశ మార్గంలో దూసుకెళ్లడమే….
  • మారనున్న హైదరాబాద్​ ముఖచిత్రం
  • రాజధానిలో రోప్​వేల నిర్మాణంపై సన్నాహాలు
  • ఇక ట్రాఫిక్​ కష్టాలు ఉండవు…

పీపుల్స్​డైరీ – హైదరాబాద్​ :
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు, భాగ్యనగర వాసులకు త్వరలోనే ఆకాశ మార్గంలో ప్రయాణించే అవకాశం కలగనుంది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ నగరంలో రోప్‌వే ప్రాజెక్టులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు పర్వత ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన రోప్‌వేలను ఇప్పుడు నగర రవాణాలో భాగంగా వినియోగించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం విశేషం. ఇందుకోసం దేశంలోనే తొలి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రోప్‌వేగా గుర్తింపు పొందిన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి మోడల్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నారు.

ఈ ప్రాజెక్టులో తొలి దశగా గోల్కొండ కోట నుంచి కుతుబ్ షాహీ టూంబ్స్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర రోప్‌వే ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అనంతరం దీనిని నెహ్రూ జూలాజికల్ పార్క్ వరకు పొడిగించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం 6 కిలోమీటర్ల మేర ప్రయాణికులకు అద్భుతమైన ఏరియల్ వ్యూ అనుభూతిని అందించనుంది. అంతేకాకుండా ట్యాంక్‌బండ్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు, అలాగే ఐటీ కారిడార్లలో ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో కూడా రోప్‌వేలను ప్రవేశపెట్టే అవకాశాలను అధ్యయనం చేస్తున్నారు. మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్ల నుంచి సమీప వాణిజ్య సముదాయాలకు లాస్ట్ మైల్ కనెక్టివిటీగా ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయి.

ఈ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (PPP) పద్ధతిలో అమలు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడకుండా ఉంటుంది. అయితే ప్రైవేటు ఆస్తుల మీదుగా రోప్‌వే మార్గాలు వెళ్లే సందర్భంలో పరిహారం అంశాలపై పాలసీలో మార్పులు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), రక్షణ శాఖల నుంచి అనుమతులు పొందేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. అన్ని అనుమతులు లభిస్తే హైదరాబాద్‌లో త్వరలోనే స్కై ట్రాన్స్‌పోర్ట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

వారణాసిలో గంటసేపు పట్టే ప్రయాణాన్ని కేవలం 16 నిమిషాల్లో పూర్తి చేసేలా రోప్‌వే వ్యవస్థను రూపొందించారు. అదే తరహాలో హైదరాబాద్‌లో కూడా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా వర్షాకాలంలో నగర ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలకు రోప్‌వేలు శాశ్వత పరిష్కారంగా మారనున్నాయని భావిస్తున్నారు. టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా నిర్ణయించి, అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తే హైదరాబాద్ రవాణా రంగంలో ఇది చారిత్రాత్మక మార్పుకు నాంది కానుంది.

అనారోగ్యంతో తండ్రి మృతి.. కరెంట్ షాక్ తో కుమారుడు మృతి .

  • రెండు రోజుల్లో తండ్రి, కొడుకు మృతి.
  • రూపిరెడ్డి పల్లి గ్రామంలో తీవ్ర విషాదం..

రేగొండ మే 28 పీపుల్స్ డైరీ..

అనారోగ్యంతో బాధపడుతూ మృత్యువుతో పోరాడి తండ్రి చెందగా రెండవ రోజు కరెంట్ షాక్ తో కొడుకు మృతి చెందిన విషాద సంఘటన రూపిరెడ్డి పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రేగొండ మండలం రూపిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కనుకుంట్ల సమ్మయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతు ఈనెల 26 మంగళవారం రోజు మృతి చెందాడు. కాగా శుక్రవారం రోజు మృతుడు సమ్మయ్య దిన చర్యలో భాగంగా దినం ముట్టించేందు కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో మృతుడు సమ్మయ్య కొడుకు కనుకుంట్ల గోపి( 46) ఇంటిముందు మోటార్ వేసి నీళ్లు పడుతున్న క్రమంలో ఇంటి ముందు రేకులకు అనుకోని ఉన్న విద్యుత్ వైరు తగిలి షాక్ కు గురయ్యడు గోపిని కాపాడడానికి వెళ్లిన గోపి అక్కకి కూడా షాక్ తగిలి అడ్డం పడిపోయారు. కాగా ఇద్దరినీ పరకాల ప్రభుత్వ హాస్పటల్ తరలించే సరికి గోపి మృతి చెందాడు. రాక్షంచడానికి వెళ్లిన మృతుడు గోపి అక్కకు ప్రమాదం తప్పి చికిత్స పొందుతునంది.కాగా గోపి మృతికి గల కారణాలు తెలుసుకొని మృతుని భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రేగొండ పోలీసులు తెలిపారు.రెండు రోజుల వ్యవదిలో తండ్రి కొడుకు మృతి చెందడంతో రూపిరెడ్డి పల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

కాల్చితే కాలుష్యం.. కలియదున్నితేనే భూసారం

కాల్చితే కాలుష్యం.. కలియదున్నితేనే భూసారం

కాల్చితే నష్టం.. కలియదున్నితే లాభం..

– సీఐ కరుణాకర్ రావు

– కొయ్యలు కాల్చొద్దు.. భూసారం కాపాడండి

– మంటల్లో మాడిపోతున్న నేల పోషకాలు

– సూక్ష్మజీవులు నశించి దిగుబడులపై తీవ్ర ప్రభావం

– నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, కేసులు తప్పవు

– రైతులకు పలు సూచనలు చేసిన సీఐ కరుణాకర్ రావు

 

గణపురం, మే 27 (పీపుల్స్ డైరీ): పంట కోతలు పూర్తయ్యాక పొలాల్లో వరి కొయ్యలు, పంట వ్యర్థాలను తగులబెట్టే అలవాటు రైతాంగానికే ప్రమాదకరంగా మారుతోందని సీఐ కరుణాకర్ రావు హెచ్చరించారు. రైతులు అవగాహన లేకుండా చేస్తున్న ఈ చర్య భూమి సారాన్ని దెబ్బతీయడమే కాకుండా పర్యావరణ సమతౌల్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోందన్నారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూమి నిస్సారంగా మారి భవిష్యత్తులో సాగుకు అనుకూలత కోల్పోయే పరిస్థితి వస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు అవగాహన కల్పిస్తూ ఆయన మాట్లాడుతూ… వరి కొయ్యలు, పంట అవశేషాలను కాల్చడం వల్ల భూమిలో సహజంగా ఉండే తేమ పూర్తిగా ఆవిరైపోతుందని చెప్పారు. భూమికి అత్యంత అవసరమైన సేంద్రియ కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి కీలక పోషకాలు మంటల్లో కాలిపోవడంతో నేలలో పోషక విలువలు గణనీయంగా తగ్గిపోతాయని వివరించారు. దీని ప్రభావం తర్వాతి పంటల దిగుబడులపై తీవ్రంగా పడుతుందని తెలిపారు. మంటల వేడి కారణంగా భూమి పైపొరల్లో నివసించే వానపాములు, సూక్ష్మజీవులు, జీవాణువులు వంటి ప్రకృతి సహజ సంపద నశిస్తోందన్నారు. ఇవే నేలను మెత్తగా ఉంచి పంట ఎదుగుదలకు సహకరిస్తాయని, అవి లేకపోవడంతో భూమి గట్టిపడి దున్నేందుకు కూడా ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. దీర్ఘకాలంలో భూసారం తగ్గిపోవడంతో రైతులు అధిక ఎరువులు, ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. వరి కొయ్యలు కాల్చడం వల్ల ఉత్పత్తి అయ్యే పొగ, బూడిద గాలిలో కలిసిపోవడంతో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, కంటి మంటలు వంటి సమస్యలు పెరుగుతున్నాయని వివరించారు. అలాగే ఒక పొలంలో వేసిన మంటలు పక్కనే ఉన్న పొలాలకు వ్యాపించి భారీ అగ్నిప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. కొన్నిసార్లు విద్యుత్ తీగలు, చెట్లు, పశువుల కొట్లకు కూడా మంటలు అంటుకుని ఆస్తి నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. రైతులు క్షణిక సౌలభ్యం కోసం చేసే ఈ పని చివరకు పెద్ద నష్టాలకు కారణమవుతోందన్నారు. పంట అవశేషాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు. పొలంలో నీరు పెట్టి ట్రాక్టర్ రోటావేటర్ లేదా కేజ్ వీల్ చక్రాలతో కలియదున్నడం ద్వారా వరి కొయ్యలను నేలలోనే కలపవచ్చని తెలిపారు. అదేవిధంగా ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా వేస్ట్ డీకంపోజర్ ఉపయోగిస్తే రెండు నుంచి మూడు వారాల్లో పంట అవశేషాలు పూర్తిగా కుళ్లిపోయి సేంద్రియ ఎరువుగా మారుతాయని చెప్పారు. దీంతో భూమి సారవంతమై దిగుబడులు 5 నుంచి 10 శాతం వరకు పెరిగే అవకాశముందని వివరించారు. పంట వ్యర్థాలను తగులబెట్టడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ కరుణాకర్ రావు స్పష్టం చేశారు. రైతులు భూమిని కాపాడుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని అన్నారు.

గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందిని కార్మికులుగా గుర్తించి, కనీస వేతనాలు ఇవ్వాలి

0

గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందిని కార్మికులుగా గుర్తించి, కనీస వేతనాలు ఇవ్వాలి

  • మంత్రి సీతక్కకు సిపిఐ – ఏఐటీయూసీ (AITUC) నాయకుల వినతి
  • సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ

నల్లబెల్లి, మే 28: పీపుల్స్ డైరీ

రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది (మల్టీపర్పస్ వర్కర్స్) ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సిపిఐ – ఏఐటీయూసీ నాయకులు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం సమర్పించారు. మొకళ్ళపల్లిలో జరిగిన ఈ భేటీలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు చింతకింది కుమారస్వామి ముఖ్య భూమిక పోషించారు.

నల్లబెల్లి మండల గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సంఘం (ఏఐటీయూసీ) మండల గౌరవ అధ్యక్షులు జన్ను సుదర్శన్, అధ్యక్షులు మామిడిపల్లి సంపత్, ఉపాధ్యక్షులు అంబిరాజు, కోశాధికారి మామిడిపల్లి రవి తదితరుల ఆధ్వర్యంలో మంత్రిని కలిసి కార్మికుల సమస్యలను వివరించారు.

వినతిపత్రంలోని ముఖ్య డిమాండ్లు:

వేతనాల చెల్లింపు: గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతనాలన్నింటినీ తక్షణమే విడుదల చేయాలి.మల్టీపర్పస్ వర్కర్స్‌ను కార్మికులుగా గుర్తిస్తూ కార్మిక చట్టాలను పక్కాగా అమలు చేయాలి.

కనీస వేతనాలు & సౌకర్యాలు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస వేతనాలు అందించడంతో పాటు, పీఎఫ్ (PF), ఇన్సూరెన్స్ వంటి అన్ని రకాల సామాజిక భద్రతా సౌకర్యాలను కల్పించాలి.

మంత్రి సానుకూల స్పందన:

కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి సీతక్క ఈ సందర్భంగా తెలిపారు. వినతిపత్రంలోని అంశాలను పరిశీలించి, పారిశుద్ధ్య సిబ్బంది సమస్యలు తప్పకుండా పరిష్కారమయ్యేలా తగిన కృషి చేస్తానని ఆమె నాయకులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పారిశుద్ధ్య కార్మిక సంఘాల ప్రతినిధులు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు

పంట వ్యర్థాల దహనం చేస్తే జైలు, భారీ జరిమానాలు

0
  • వ్యర్థాల దహనంపై శాటిలైట్ నిఘా
  • వ్యవసాయంలో కొత్త ప్రమాద ఘంటిక

ఇప్పటివరకు ఉత్తర భారతదేశానికి, ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రానికే పరిమితమైందని భావించిన పంట వ్యర్థాల దహనం సమస్య ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్నీ వేధిస్తోంది. వరి, మక్కజొన్న పంటల కోత అనంతరం మిగిలిపోయే ఎండు గడ్డిని రైతులు తగులబెట్టడం వల్ల పర్యావరణానికి నష్టం కలగడమే కాకుండా ప్రాణ నష్టాలు కూడా సంభవిస్తున్నాయి. ఇటీవలి కాలంలో పలు జిల్లాల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో రైతులు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ శాఖ అధికారుల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల కొరత, పశువుల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాలతో రైతులు పొలాలను త్వరగా శుభ్రం చేసుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గతంలో పంట వ్యర్థాలను పశువుల మేతగా వినియోగించేవారు. అయితే ఇప్పుడు ఆ అవసరం తగ్గిపోవడంతో రైతులు వాటిని తగులబెట్టడం సులభమైన పరిష్కారంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ ఘటనలు తీవ్రరూపం దాల్చాయి. ఖమ్మం జిల్లా పాథర్లపాడులో రైతులు పెట్టిన మంటలు పక్కనే ఉన్న పంట పొలాలకు వ్యాపించి వందల క్వింటాళ్ల దిగుబడి బూడిదయ్యింది. ఈ ప్రమాదాలు రైతుల కుటుంబాల్లో విషాదాన్ని మిగులుస్తున్నాయి. మే 24న భూపాలపల్లి జిల్లాలో చంద్రమౌళి అనే రైతు పంట వ్యర్థాలను తగులబెడుతూ మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. ఆ ఘటనను చూసిన ఆయన భార్య భాగ్యమ్మ తీవ్ర ఆవేదనతో అక్కడికక్కడే కన్నుమూసింది. అలాగే మే 13న నిర్మల్ జిల్లాలో మంద గంగన్న అనే రైతు మక్కజొన్న వ్యర్థాలకు నిప్పు పెట్టగా మంటలు వరి పొలాలకు వ్యాపించాయి. వాటిని ఆర్పే ప్రయత్నంలో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయాడు. మే 10న హనుమకొండ జిల్లాలో జి. జయపాల్ రెడ్డి అనే వృద్ధ రైతు ప్రమాదవశాత్తు మంటల్లో పడిపోయి మరణించాడు. ఈ ఘటనల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట వ్యర్థాల దహనం వల్ల గాలి నాణ్యత దెబ్బతినడమే కాకుండా భూసారం కూడా తగ్గిపోతుందని ఆయన హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇకపై పొలాల్లో మంటలు పెట్టే రైతులను గుర్తించేందుకు ప్రభుత్వం శాటిలైట్ ఇమేజరీ వినియోగించనుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలు, ఎయిర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయనున్నారు. అవసరమైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదే విధంగా పర్యావరణ పరిహారం పేరుతో జరిమానాలు కూడా విధించనున్నారు. 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రూ.2500, 2 నుంచి 5 ఎకరాల మధ్య భూమి ఉన్నవారికి రూ.5000, 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు రూ.15 వేల వరకు జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ సమస్య మరింత తీవ్రమవకుండా ఉండేందుకు గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతులు కూడా పంట వ్యర్థాల దహనం వల్ల కలిగే ప్రమాదాలను గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

🦁 శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మహిమ 🕉️

0

భక్తుని రక్షణకై అవతరించిన ఉగ్ర కరుణామయుడు

హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు తనను తాను దేవుడిగా ప్రకటించి, భగవంతుడిని పూజించవద్దని ప్రజలను బలవంతం చేశాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం చిన్న వయస్సులోనే శ్రీమహావిష్ణువుపై అచంచల భక్తిని పెంచుకున్నాడు. ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టినా “నారాయణ” నామాన్ని విడువలేదు.

ప్రహ్లాదుడి భక్తిని చూసి కోపంతో ఉక్కిరిబిక్కిరైన హిరణ్యకశిపుడు,
“నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు?” అని అడిగాడు.
అప్పుడు ప్రహ్లాదుడు,
“అన్నిచోట్లా ఉన్నాడు” అని సమాధానం ఇచ్చాడు.

దాంతో హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపించి,
“ఈ స్తంభంలో కూడా ఉన్నాడా?” అని అడిగాడు.
“ఉన్నాడు” అని ప్రహ్లాదుడు చెప్పగానే, అతడు ఆ స్తంభాన్ని గుద్దాడు.

అప్పుడే ఆ స్తంభం చీలి, అర్థమానవుడు – అర్థసింహరూపంలో శ్రీ నరసింహ స్వామి ప్రత్యక్షమయ్యారు.
సాయంకాల సమయంలో, గడపపై కూర్చొని, తన గోళ్లతో హిరణ్యకశిపుని సంహరించి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించారు.

🌺 నరసింహ స్వామి సందేశం

భక్తుడిని భగవంతుడు ఎప్పటికీ విడిచిపెట్టడు

నిజమైన విశ్వాసానికి దేవుడు ప్రత్యక్షమవుతాడు

ధర్మాన్ని కాపాడటానికి దైవం ఎప్పుడైనా అవతరిస్తుంది

🙏 నరసింహ మంత్రం

> ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖమ్ ।
నృసింహం భీషణం భద్రం
మృత్యోర్మృత్యుం నమామ్యహమ్ ॥

ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే భయాలు తొలగి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని విశ్వాసం.

🌼 ముగింపు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం ఉంటే చెడు శక్తులు దూరమై, ఇంటిలో శాంతి, సౌఖ్యం, ధైర్యం నెలకొంటాయి. భక్తితో ఆయనను ప్రార్థిస్తే జీవితంలో విజయాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

🦁 జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి 🙏

error: Content is protected !!