ఉపాధి హామీ సిబ్బందికి వేతనాలు విడుదల చేయాలి: దళిత విద్యావంతుల వేదిక డిమాండ్
నల్లబెల్లి:
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత మూడు నెలలుగా నిలిచిపోయిన వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నల్లబెల్లి మండల కేంద్రంలోని స్థానిక సబ్ పోస్ట్ ఆఫీస్ (SPM) ద్వారా జిల్లా కలెక్టర్ గౌరవనీయులు డాక్టర్ సత్య శారద గారికి రిజిస్టర్ పోస్టు ద్వారా విజ్ఞాపన పత్రం పంపించారు.ఈ సందర్భంగా బట్టు సాంబయ్య మాట్లాడుతూ… ఉపాధి హామీ పథకంలో APO, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లుగా వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న సిబ్బందికి గత మూడు మాసాలుగా వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించి, స్పందించి సిబ్బంది పెండింగ్ వేతనాలు త్వరగా విడుదలయ్యేలా చూడాలని కోరారు.అలాగే, ఉపాధి హామీ పథకంలో ఒకే ప్రాంతంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బదిలీలు (Transfers) చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఒకే చోట సుదీర్ఘకాలం పనిచేయడం వల్ల అవినీతి, అక్రమాలకు తావు ఇచ్చే అవకాశం ఉన్నందున, వెంటనే బదిలీల ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ గారిని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సబ్ పోస్ట్ మాస్టర్ (SPM) అనిల్, పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
