గ్రావిటీ కెనాల్‌కు గత పాలకుల నిర్ణయాలే శాపం
– ‘దయ్యాలు వేదాలు వల్లించినట్లే’ అంటూ ఉంది బిఆర్ఎస్ తీరు…!
– రైతులను మోసం చేసి.. నేడు విమర్శలు చేయడం విడ్డూరం
– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చొరవతో సోమవారం కాలువలకు నీటి విడుదల
– రెండు జిల్లాల కలెక్టర్ల సమన్వయంతో రామప్ప నుంచి నీటి తరలింపునకు కృషి
– విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు
పీపుల్స్ డైరీ, గణపురం:
గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలే రామప్ప నుంచి వచ్చే గ్రావిటీ కెనాల్‌కు నేడు శాపంగా మారాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. ఆదివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గోదావరి జలాలు రామప్ప చెరువులో 28 అడుగులకు చేరిన తర్వాతే తూము ద్వారా గ్రావిటీ కెనాల్ లోకి నీరు విడుదలయ్యేలా గత పాలకులు నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. వంగపల్లి వాణి చెరువు నిండిన తర్వాతే ఆ నీరు గణపసముద్రంలోకి చేరేలా నిబంధనలు రూపొందించారని తెలిపారు. గణపసముద్రం ఒక్కసారి నిండితే మూడు పంటలు పండే అవకాశం ఉండేదని, ఆరు మండలాలకు తాగునీరు అందించే మిషన్ భగీరథ పథకం కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీరు అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటెక్‌వెల్ నిర్మాణ సమయంలో గణపురం ఆయకట్టు రైతులకు రిజర్వాయర్‌లో 25 అడుగుల నీటిని నిల్వ ఉంచి, గ్రావిటీ కెనాల్ ద్వారా వచ్చే అదనపు నీటిని ఆరు మండలాల తాగునీటి అవసరాలకు వినియోగిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. అయితే గ్రావిటీ కెనాల్‌కు రామప్ప చెరువులో 24 అడుగుల నీరు ఉన్నప్పటి నుంచే నీరు వచ్చేలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అప్పట్లో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకుండా ఇప్పుడు రైతులను రెచ్చగొడుతూ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుపై విమర్శలు చేయడం ‘దయ్యాలు వేదాలు వల్లించినట్లే’ ఉందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక చొరవ తీసుకుని రెండు జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేస్తూ రామప్ప చెరువు నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా గణపసముద్రానికి నీటిని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ పనులు సకాలంలో సాగేందుకు కాలువల ద్వారా సోమవారం నీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతులంతా ఈ విషయాన్ని గమనించి వ్యవసాయ పనులను కొనసాగించాలని కోరారు.
భవిష్యత్‌లో ఇలాంటి వర్షాభావ పరిస్థితులు ఎదురైనా గణపురం ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యే గండ్ర ప్రత్యేక కృషి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కటుకూరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ దూడపాక శంకర్, నాయకులు తాళ్లపల్లి భాస్కర్ రావు, చోటేమియా, గుర్రం తిరుపతి గౌడ్, బూర రాజగోపాల్, నారగాని మోహన్, తొట్ల కుమార్, వడ్ల యాదగిరి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
