సెల్‌ఫోన్, బైక్ వదిలేసి.. యువకుడి అదృశ్యం
సైదాపూర్ మండలం పెర్కపల్లిలో ఘటన
సైదాపూర్ ( పీపుల్స్ డైరీ) : సైదాపూర్ మండలం పెర్కపల్లి గ్రామాన్నికి చెందిన అర్కాల అనిల్ అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వాహనం, మొబైల్ ఫోన్ వదిలేసి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, అనిల్ తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. పెర్కపల్లి గ్రామానికి చెందిన అర్కాల అనిల్ (26) గ్రామంలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి గత ఏడాదే వివాహం జరగ్గా.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో నెల రోజుల క్రితం ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన ద్విచక్ర వాహనంపై పెర్కపల్లి నుంచి సైదాపూర్‌కు వచ్చిన అనిల్.. సైదాపూర్ కూరగాయల మార్కెట్ వద్ద తన బైక్‌ను నిలిపాడు. అనంతరం తన తమ్ముడు రాకేశ్‌కు ఫోన్లో మెసేజ్ పంపాడు. ‘బైక్‌ను కూరగాయల మార్కెట్ వద్ద పార్క్ చేశా. సెల్‌ఫోన్‌ను బండి టూల్ బాక్స్‌లో, తాళం చెవిని ట్యాంక్ కవర్‌లో ఉంచా’ అని అందులో పేర్కొన్నాడు.
ఆ తర్వాత నుంచి అనిల్ ఇంటికి తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కు రగాయల మార్కెట్ వద్దకు వెళ్లి చూడగా బైక్, ఫోన్ అక్కడే ఉన్నాయి. బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద ఎంత గాలించినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో కుమారుడు కనిపించడం లేదంటూ అనిల్ తండ్రి అర్కాల సంపత్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై స్వాతి, పోలీసులు దర్యాప్తు చర్యలు ముమ్మరం చేశారు.
