వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి..
(పీపుల్స్ డైరీ) క్రైమ్.
గీసుగొండ మండలం దస్రు తండా–కొమాల గ్రామ స్టేజీ మధ్య వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు.సంగెం మండలం వంజరపల్లి గ్రామానికి చెందిన గోనె సమ్మయ్య (70) వ్యవసాయ పనిముట్ల వెల్డింగ్ పని కోసం తన టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనంపై కొమాల వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం సుమారు 3.30 గంటల సమయంలో నర్సంపేట వైపు నుంచి వరంగల్ వైపు వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు అతడి వాహనాన్ని ఎదురుగా ఢీకొట్టింది.కారు డ్రైవర్ వనంప్రమోద్ కుమార్ అతివేగంగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో ప్రమాదం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢీకొన్న అనంతరం సమ్మయ్యను కొంత దూరం వరకు కారు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో సమ్మయ్య తలకు బలమైన గాయం కావడంతో పాటు ముఖం, ఛాతీ, ఎడమ తొడ, ఎడమ చేయి, కుడి చేయిపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.మృతుడి భార్య గోనె సరోజన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ వనంప్రమోద్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గీసుగొండ ఇన్స్పెక్టర్ డి. విశ్వేశ్వర్ తెలిపారు.
