విస్తృతoగా
Help to needy.మరియు లక్ష్మి అమ్మ ఫౌండేషన్ సేవలు.
పీపుల్స్ డైరీ 22-6-26
Help to Needy,మరియు లక్ష్మి అమ్మ ఫౌండేషన్
స్వచ్చంద సంస్థ లు సంయుక్తంగా గాంధీనగర్ గ్రామాన్ని దత్తత తీసుకొని గత నెల రోజులుగా గ్రామంలోని నిరుపేదలకు బియ్యం నిత్యావసర సరుకులు అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా
ఈ రోజు మరో ముగ్గురు నిరుపేదలైన
1.పల్లెబోయిన స్వర్ణలత
2.కీర్తి వణమ్మ
3.మరుపట్ల కోమల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5వేల రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు అందించారు.ఈ సందర్బంగా గాంధీనగర్ సర్పంచ్ డా:ఇంజపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నిస్వార్ధoగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్చందంగా సెవ చేస్తున్న రెండు సంస్థల ప్రతినిధులను అభినదించారు.అలాగే ఇంకా ఎవరైనా దాతలుగాని CSR ఫOడ్స్ అందించే సంస్థలు గాని ముందుకు వచ్చి లక్ష్మి అమ్మ ఫౌండేషన్ &Help to Needy సంస్థలకు అర్ధక సహాయం అందించి వీరి సేవలు ఇంకా విస్తృతపరిచేవిదంగా సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో సర్పంచ్ Dr:ఇంజపల్లి శ్రీనివాస్ తో పాటు మాజీసింగిల్ విండో డైరెక్టర్ సెగ్గం శ్రీనివాస్, స్వచ్చంద సంస్థల ప్రతినిదులు గ్రామప్రజలు హాజరయ్యారు
చెల్పూర్ ఆర్టీవో కార్యాలయం వద్ద ప్రమాదం విధి నిర్వహణలోనే ప్రమాదం
20 రోజుల క్రితమే జిల్లాకు వచ్చిన అధికారి
పీపుల్స్ డైరీ, భూపాలపల్లి : విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా శాఖ అధికారి (ఆర్టీవో)ని అతివేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని చెల్పూర్ శివారులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఆర్టీవో వెంకన్న ఆర్టీవో కార్యాలయం సమీపంలో రోడ్డుపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బొగ్గు లోడుతో వచ్చిన లారీ ఆయనను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వెంకన్న రోడ్డుపై పడిపోగా, ఆయన పైనుంచి లారీ వెళ్ళింది దాంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. కాగా, వెంకన్న కేవలం 15 రోజుల క్రితమే బదిలీపై భూపాలపల్లి జిల్లాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఆయన మృతిచెందడం రవాణా శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వెంకన్న మృతిపై సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
సైదాపూర్ ( పీపుల్స్ డైరీ) : సైదాపూర్ మండలం పెర్కపల్లి గ్రామాన్నికి చెందిన అర్కాల అనిల్ అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వాహనం, మొబైల్ ఫోన్ వదిలేసి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, అనిల్ తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. పెర్కపల్లి గ్రామానికి చెందిన అర్కాల అనిల్ (26) గ్రామంలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి గత ఏడాదే వివాహం జరగ్గా.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో నెల రోజుల క్రితం ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన ద్విచక్ర వాహనంపై పెర్కపల్లి నుంచి సైదాపూర్‌కు వచ్చిన అనిల్.. సైదాపూర్ కూరగాయల మార్కెట్ వద్ద తన బైక్‌ను నిలిపాడు. అనంతరం తన తమ్ముడు రాకేశ్‌కు ఫోన్లో మెసేజ్ పంపాడు. ‘బైక్‌ను కూరగాయల మార్కెట్ వద్ద పార్క్ చేశా. సెల్‌ఫోన్‌ను బండి టూల్ బాక్స్‌లో, తాళం చెవిని ట్యాంక్ కవర్‌లో ఉంచా’ అని అందులో పేర్కొన్నాడు.
ఆ తర్వాత నుంచి అనిల్ ఇంటికి తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కు రగాయల మార్కెట్ వద్దకు వెళ్లి చూడగా బైక్, ఫోన్ అక్కడే ఉన్నాయి. బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద ఎంత గాలించినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో కుమారుడు కనిపించడం లేదంటూ అనిల్ తండ్రి అర్కాల సంపత్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై స్వాతి, పోలీసులు దర్యాప్తు చర్యలు ముమ్మరం చేశారు.
రేగొండ జూన్ 22 (పీపుల్స్ డైరీ) : గోరి కొత్తపల్లి మండలం పరిధిలోని జగ్గయ్యపేట శివారులో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై రేగొండ వైపు వెళ్తుండగా జగ్గయ్యపేట శివారులోని ఒక మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్, వయస్సు 21 సంవత్సరాలు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు మరియు గాయపడిన వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
tపల్లె వెలుగు బస్సును ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ సుధాకర్
సైదాపూర్ (పీపుల్స్ డైరీ) : సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో కరీంనగర్ కు నూతన ఆర్టీసీ బస్సు సేవలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని.. ఈ బస్సు కరీంనగర్ నుండి మానకొండూరు,ముంజంపల్లి,పోరండ్ల,మన్నెంపల్లి,మల్లాపూర్,పోలంపల్లి,మొగిలిపాలెం ,రేకొండ,బొమ్మనపల్లి,దుద్దెనపల్లి,ఎక్లాస్పూర్,సోమారం చౌరస్తా,సైదాపూర్ నుండి తిరిగి దుద్దెనపల్లి,బొమ్మనపల్లి,రేకొండ,మొగిలిపాలెం,పోలంపల్లి,మల్లాపూర్,మన్నెంపల్లి,పోరండ్ల,ముంజంపల్లి,మానకొండూరు మీదుగా తిరిగి కరీంనగర్ వరకు ప్రయాణికులకు సేవలు అందించనుందని తెలిపారు..
విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు ప్రతిరోజు రాకపోకల విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చామని.. ఈ సేవతో ప్రజలకు సమయం, ఖర్చు ఆదా కావడంతోపాటు వారి ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా మారను ఉన్నాయని అన్నారు.. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల లక్షలాదిమంది మహిళలు, విద్య, ఉపాధి వ్యాపారం కుటుంబ అవసరాల కోసం ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ప్రయాణించే అవకాశం పొందుతున్నారని పేర్కొన్నారు, మహిళల ఆర్థిక సాధికారతకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని.. అంతేకాకుండా మండలంలోని ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా అనుసంధానం (కనెక్టివిటీ) కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు..తమ చిరకాల కోరికను నెరవేర్చిన గౌరవ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మండల ప్రజలు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచ్లు, PACS ఛైర్మన్,వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు,ప్రజా ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
ఏన్కూరు (పీపుల్స్ డైరీ) : ఏన్కూరు మండలం రాజలింగాల – తిమ్మరావుపేట ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ఒక మినీ వ్యాన్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన కొందరు వ్యక్తులు ఖమ్మం నుంచి మినీ వ్యాన్‌లో తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో రాజలింగాల మూల మలుపు వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలోని ఎయిర్ బెలూన్స్ సకాలంలో తెరుచుకోవడంతో ఒక చిన్నారితో పాటు ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ రాజలింగాల మూల మలుపు అత్యంత ప్రమాదకరంగా మారిందని, గతంలోనూ ఇక్కడ అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదని వారు మండిపడుతున్నారు. ఇకనైనా ప్రమాదాలు జరగకుండా చూడాలని రాజలింగాల, తిమ్మరావుపేట గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు. ప్రమాదకర మలుపును సూచించే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు వేయాలి,
రాత్రి వేళల్లో దారి స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టర్లు, రోడ్డు మార్కింగ్‌లు ఏర్పాటు చేయాలనీ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
కేటీపీపీలోని వైటీపీఎస్ విద్యుత్ కేంద్ర పరిధిలో బొగ్గు, బూడిద నిర్వహణ విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే టెండరు ప్రక్రియను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ (జేఏసీ) కేంద్ర కమిటీ పిలుపుమేరకు కేటీపీపి శాఖ ఆధ్వర్యంలో ప్రధాన గేటు ఎదుట ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ… విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు, బూడిద నిర్వహణ విభాగాలు అత్యంత కీలకమైనవని, అవి విద్యుత్ కేంద్రానికి ప్రాణాధారమని పేర్కొన్నారు. అలాంటి విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల అనుభవం కలిగిన శాశ్వత సిబ్బందిని పక్కనపెట్టే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ప్రైవేటీకరణ వల్ల పని భారం అసమానంగా పెరగడంతో పాటు భద్రతా ప్రమాణాలు దెబ్బతినే అవకాశం ఉందని, తద్వారా విద్యుత్ కేంద్ర భద్రతకే ముప్పు వాటిల్లవచ్చని హెచ్చరించారు. ప్రజా రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రైవేటీకరణ చర్యలు చేపట్టడం సమంజసం కాదన్నారు. బొగ్గు, బూడిద నిర్వహణ విభాగాల టెండరు ప్రక్రియను వెంటనే రద్దు చేసి, శాశ్వత సిబ్బందితోనే నిర్వహణ కొనసాగించాలని ప్రభుత్వం, ఉన్నతాధికారులను కోరారు. ఇది ఒక్క విద్యుత్ కేంద్రానికి సంబంధించిన సమస్య కాదని, రానున్న రోజుల్లో విద్యుత్ రంగంలోని ఇతర కీలక విభాగాలను కూడా ప్రైవేటు చేతుల్లోకి అప్పగించేందుకు ఇది తొలి అడుగుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను యాజమాన్యం పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఉద్యోగులు స్పష్టం చేశారు.
నర్సంపేట నుండి శ్రీశైలం ప్రత్యేక యాత్రా బస్సు సర్వీస్ ప్రారంభం
పీపుల్స్ డైరీ నర్సంపేట
నర్సంపేట డిపో నుండి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక యాత్రా బస్సు సర్వీసును ప్రారంభించింది. ఇది ప్రతిరోజూ నడిచే సాధారణ బస్సు సర్వీస్ కాదని, ప్రయాణికులు మరియు భక్తుల రద్దీని, డిమాండ్‌ను బట్టి మాత్రమే నడిచే ప్రత్యేక యాత్రా బస్సు (Special Tour/Yatra Service) అని అధికారులు స్పష్టం చేశారు.ఈ ప్రత్యేక సర్వీస్ ప్రారంభోత్సవం సందర్భంగా నర్సంపేట డిపో డ్రైవర్లు, సిబ్బంది బస్సుకు ఘనంగా పూజలు నిర్వహించారు. వాహనాన్ని పూలమాలలతో అలంకరించి, సాంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక ప్రార్థనలు చేసి బస్సును ప్రారంభించారు. ప్రయాణికుల ప్రయాణం క్షేమంగా సాగాలని డ్రైవర్లు ఆకాంక్షించారు.శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు గుంపుగా (గ్రూప్‌గా) ఏర్పడినప్పుడు లేదా పండుగలు, పర్వదినాల వంటి ప్రత్యేక సందర్భాలలో ప్రయాణికుల సంఖ్యను బట్టి ఈ బస్సు సర్వీసును నడుపుతారు.ఇంతకాలం శ్రీశైలం వెళ్లడానికి సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడిన స్థానిక భక్తులకు ఈ యాత్రా బస్సు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. నర్సంపేట మరియు పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు ఈ ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని సమూహాలుగా బుక్ చేసుకుని వినియోగించుకోవాలని డిపో మేనేజర్ సరస్వతి తెలియజేసారు
మూడు చెక్కలపల్లిలో అంతర్గత మట్టి రోడ్ల నిర్మాణం: వర్షాకాలం ముందస్తు చర్యలు
నల్లబెల్లి పీపుల్స్ డైరీ
రానున్న వర్షాకాలంలో గ్రామ ప్రజలకు రాకపోకల ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నల్లబెల్లి మండల పరిధిలోని మూడు చెక్కలపల్లి గ్రామ పంచాయతీలో ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామంలోని అంతర్గత మట్టి రోడ్లపై మట్టి మరియు మొరము పోయించి రోడ్లను బాగు చేయించారు.గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ ప్రత్యేక చొరవ తీసుకొని ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. వర్షాలు పడితే రోడ్లు బురదమయంగా మారి ప్రజలు, పాఠశాల విద్యార్థులు, వాహనదారులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ముందస్తు నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.ఈ రోడ్ల మరమ్మతు కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు స్థానిక నాయకులు, గ్రామస్థులు చురుగ్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్లావత్ రవి, బోడ సురేష్ మరియు గ్రామ వార్డు సభ్యులు, యువకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సమస్యలపై త్వరితగతిన స్పందించి, వర్షాకాలానికి ముందే అంతర్గత రోడ్లను సిద్ధం చేయించినందుకు గాను మూడు చెక్కలపల్లి గ్రామ ప్రజలు సర్పంచ్ కవిత దేవు నాయక్ మరియు తోడ్పాటు అందించిన నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రభుత్వ పాఠశాలలో తమ కూతురికి అడ్మిషన్ తీసుకుంటున్న సర్పంచ్ శ్రీలత అశోక్
– బుద్ధారం గ్రామంలో ఆదర్శంగా నిలిచిన సర్పంచ్ శ్రీలత అశోక్ – ఐదో తరగతిలో కుమార్తెకు ప్రవేశం – ఇతర తల్లిదండ్రులకు మార్గదర్శకంగా సర్పంచ్ నిర్ణయం – ప్రభుత్వ పాఠశాలల వైపు అడుగులు వేయాలని పిలుపు – ఉపాధ్యాయులు, గ్రామస్థుల హర్షం – నాణ్యమైన విద్యకు ప్రభుత్వ బడులే వేదిక – బడిబాట కార్యక్రమానికి మరింత ఊతం – ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న ప్రజల నమ్మకం
గణపురం, జున్ 17 (పీపుల్స్ డైరీ):
ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులపై తనకున్న విశ్వాసాన్ని బుద్ధారం గ్రామ సర్పంచ్ విడిదినేని శ్రీలత అశోక్ ఆచరణలో చూపించారు. బుధవారం మండలంలోని బుద్ధారం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో తన కుమార్తెకు ఐదో తరగతిలో ప్రవేశం కల్పించి ఇతర తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందనే సందేశాన్ని సమాజానికి చాటాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ బడుల్లో మెరుగైన బోధన, ఆధునిక సదుపాయాలు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. సర్పంచ్ తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం పట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవీందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ముందుండి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని చాటడం అభినందనీయమని అన్నారు. ఈ నిర్ణయం గ్రామంలో మరింత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రోత్సాహకంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు సైతం సర్పంచ్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ప్రభుత్వ విద్యపై విశ్వాసానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మారబోయిన ఐలయ్య ,అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు ,వార్డ్ మెంబర్స్ ,గ్రామ ప్రముఖులు, యువజన సంఘాల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.